కరోనా ఆంక్షలతో హడలెత్తిపోతున్న చైనా పౌరులు 

కరోనా మ‌హ‌మ్మారికి మూల‌మైన చైనాలో కరోనా ఆంక్షల పట్ల పౌరులు హ‌డ‌లెత్తిపోతున్నారు. జీ జిన్‌పింగ్ సార‌ధ్యంలోని చైనా ప్రభుత్వం చీమ చిటుక్కుమ‌న్నా ఉలిక్కి పడుతూ కరోనా జీరో పాల‌సీ పేరిట పండుగ‌ల వేళ‌ఎం స‌మావేశాలు జ‌రిగిన‌ప్పుడు లాక్‌డౌన్‌లు విధిస్తు కఠినమైన ఆంక్షలు అమలు పరుస్తున్నది. 
 
ఇప్పుడు ఈ ఆంక్ష‌లు.. లాక్‌డౌన్‌లు అంటేనే చైనీయులు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా ఆంక్షలు తప్పించుకోవ‌డానికి వివిధ సంస్థ‌ల కార్మికులు ఫెన్సింగ్‌లు, గోడ‌లు దూకి బ‌య‌ట‌కు ప‌రుగులు తీస్తున్నారు. తాజాగా జెంగ్‌ఝౌలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, కార్మికులు త‌మ ఫ్యాక్ట‌రీ ఫెన్సింగ్ దూకేసి బ‌య‌ట‌కు పారిపోతున్న చిత్రాలు వెలుగు చూశాయి.
కరోనా మ‌హ‌మ్మారి ఉదృతంగా సాగిన వేళ సామాన్యుల మాదిరిగానే వంద‌ల కిలోమీట‌ర్ల దూరంలోని త‌మ సొంతిండ్ల‌కు కాలి న‌డ‌క‌నే వెళ్లిపోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. వారంతా ఫాక్స్‌కాన్ సిబ్బంది అని తెలుస్తున్న‌ది. ఆపిల్ ఐఫోన్ల‌ను చైనాలో ఫాక్స్‌కాన్ సంస్థ త‌యారు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై నెటిజ‌న్లు స్పందిస్తున్నారు.
`జెంగ్‌ఝౌ సిటీలోని అతిపెద్ద ఐ-ఫోన్ ఫ్యాక్ట‌రీలోని సిబ్బంది ఫెన్సింగ్ దూకేస్తున్నారు. దొంగ‌చాటుగా బ‌య‌ట‌ప‌డి పరార‌వుతున్నారు` అని నెటిజ‌న్ ఓ వీడియో షేర్ చేశారు. ఫాక్స్‌కాన్ సంస్థ హెనాన్ జెంగ్‌ఝౌలో ఆపిల్ ఉత్ప‌త్తుల‌ను అసెంబ్లింగ్ చేస్తుంది. తాజాగా విడుద‌లై ఐ-ఫోన్‌-14 విడి భాగాలు కూడా అసెంబ్లింగ్ చేస్తున్న‌ది.
అయితే, ఈ కంపెనీలో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ‌టంతో ఫాక్స్‌కాన్ యాజ‌మాన్యం.. కార్మికులు, సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచిన‌ట్లు స‌మాచారం. కంపెనీ ప‌రిధిలో ఉద్యోగుల క‌ద‌లిక‌ల‌పైనా క‌ఠిన ఆంక్ష‌లు విధించార‌ని వార్తా క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో విసుగెత్తిన కార్మికులు ఫెన్సింగ్ దూకిన దృశ్యాలు వెలుగు చూశాయి.
హెనాన్ జెంగ్‌ఝౌలో ఫాక్స్‌కాన్ ప్లాంట్‌.. 3.5 ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పిస్తున్న‌ది. ఇప్పుడెంత మంది కార్మికులు ప‌ని చేస్తున్నార‌న్న స‌మాచారం ఇత‌మిద్ధంగా తెలియ‌దు. ఈ యూనిట్‌లో సుమారు 20 వేల మందికి క‌రోనా మ‌హ‌మ్మారి సోకింద‌ని వార్త‌లొచ్చినా.. వాటిని ఫాక్స్‌కాన్ తోసిపుచ్చింది.
అయితే, ఉద్యోగులు ఫెన్సింగ్ దూకి ప‌రారైన వీడియోలో బ‌య‌ట‌కు పొక్క‌డంతో ఇండ్ల‌కు వెళ్లే సిబ్బంది, కార్మికుల కోసం ఫాక్స్‌కాన్ యాజ‌మాన్యం, ప్ర‌భుత్వం వాహ‌న వ‌స‌తి క‌ల్పించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.
కరోనా  ఆంక్ష‌ల‌తో వ‌చ్చేనెల‌లో ఆపిల్ ఐఫోన్ల ఉత్ప‌త్తి సుమారు 30 శాతం త‌గ్గుతుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల క‌థ‌నం. ఈ లోటు భ‌ర్తీకి షెన్‌జెన్ సిటీలోని మ‌రో ప్రొడ‌క్ష‌న్ కేంద్రంలో ఉత్ప‌త్తి పెంచాల‌ని ఫాక్స్‌కాన్ యోచిస్తున్న‌ట్లు వినిక‌డి. ఎల‌క్ట్రానిక్స్ ఉత్ప‌త్తుల త‌యారీ దారుల‌కు అత్యంత కీల‌క‌మైన సెల‌వుల సీజ‌న్‌లో ఆంక్ష‌లు అమ‌ల్లోకి రావ‌డం కూడా ఉత్ప‌త్తి త‌గ్గ‌డానికి కార‌ణం అని తెలుస్తున్న‌ది.