పత్తి రైతుల కష్టాలు పట్టని తెలంగాణ సర్కార్

పత్తి రైతుల కష్టాలు తెలంగాణ సర్కారుకు పట్టడంలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. తేమ పేరుతో వ్యాపారులు పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభపడుతున్నారని ఆమె ఆరోపించారు. ఫలితంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

రైతన్నలకు అండగా నిలవకపోతే వారే కేసీఆర్‌కు సరైన బుద్ధి చెబుతారని ఆమె సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు.  ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతన్నలు వ్యాపారుల చేతుల్లో తీవ్రంగా మోసపోతున్నరని ఆమె పేర్కొన్నారు. జెండా పాట పేరుతో మద్దతు ధర కన్నా ఎక్కువ వస్తుందని అధికారులు చెబుతుండగా… తేమ పేరుతో వ్యాపారులు రేటులో కోత విధిస్తున్నరని ఆమె తెలిపారు. 

దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నరని అంటూ కొందరికి మాత్రమే క్వింటాకు రూ.7 వేలకు పైగా రేటు చెల్లిస్తూ… మిగిలిన వారి నుంచి తేమ ఎక్కువ ఉందని చెప్పి రూ.5 వేలకే కొంటున్నరని విజయశాంతి విచారం వ్యక్తం చేశారు. 

దీంతో అసలే దిగుబడి సరిగా లేక బాధపడుతున్న రైతులకు… కనీసం కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  వర్షాల వల్ల పత్తి తడిసిపోయి నల్లగా మారడం, వాతావరణ పరిస్థితుల కారణంగా తేమ ఎక్కువగా ఉండడం వల్ల రైతులకు కష్టంగా మారుతోందని ఆమె చెప్పారు. 

ఇది ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు… తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి ఉందని ఆమె స్పష్టం చేశారు.  ఇంత జరుగుతుంటే ఇటు అధికారులు గానీ, ప్రభుత్వం గానీ పత్తి రైతులను అసలు పట్టించుకోవడం లేదని విజయశాంతి మండిపడ్డారు.  పత్తి రైతులకు ఇప్పటికైనా తగిన మద్దతు ధర ఇవ్వాలని బీజేపీ తరఫున ఆమె డిమాండ్ చేశారు.