మూకుమ్మడిగా పెరిగే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వేదిక

మూకుమ్మడిగా పెరిగే సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వ్యాప్తి, సీమాంతర ఉగ్రవాదం వంటి సవాళ్లను, సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా ఒక ఉమ్మడి వేదికను అందించేందుకు  చింతన్ శివిర్‌ను నిర్వహిస్తున్నామని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
 ‘చింతన్ శివిర్’  పేరిట హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరిగే రెండు రోజుల మేధోమధన శిబిరంలో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల హోం మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా సారథులను ఉద్దేశించి మొదటి రోజు మాట్లాడుతూ నేడు నేరాల స్వభావాలు తీవ్రంగా మారుతున్నాయని చెప్పారు.
 అవి ఎల్లలు లేనివిగా తయారయ్యాయని అందుకే ఈ సవాళ్లపై అన్ని రాష్ట్రాలు ఉమ్మడి వ్యూహంతో పోరాడాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి, అమలు చేయడానికి, ‘సహకార సమాఖ్య’, ‘పరిపూర్ణ ప్రభుత్వం’ ‘టీమ్ ఇండియా’ విధాన స్ఫూర్తితో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు.
వామపక్ష తీవ్రవాదం ప్రభావిత ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు ఒకప్పుడు హింసకు, అశాంతికి ఆటపట్టువులుగా ఉండేవని,  అవే ప్రాంతాలు ఇప్పుడు క్రమంగా అభివృద్ధికి కేంద్రాలుగా మారుతున్నాయని కేంద్ర హోం మంత్రి గుర్తు చేశారు. గత ఎనిమిదేళ్లలో ఈశాన్య ప్రాంతంలో భద్రతా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని, 2014 నుంచి తిరుగుబాటు ఘటనలు 74 శాతం, భద్రతా బలగాల్లో మృతులు, క్షతగాత్రుల సంఖ్య 60 శాతం, పౌరుల మరణాల్లో 90 శాతం తగ్గుదల నమోదవుతూ వస్తోందని వివరించారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, అక్కడ శాంతి,  పురోగతికి కొత్తశకం ప్రారంభమైందని చెప్పారు. 2019 ఆగస్టు5వ తేదీకి మునుపు, 37 నెలలతో పోలిస్తే 2019 ఆగస్టు 5 తర్వాత 37 నెలల కాలంలో ఉగ్రవాద ఘటనలు 34 శాతం, భద్రతా దళాల మరణాలు 54 శాతం తగ్గాయని తెలిపారు.
  ఉగ్రవాదంపై నిర్ణయాత్మక విజయం సాధించడానికి జాతీయ దర్యాప్తు సంస్థను (ఎన్.ఐ.ఎ.ని) ఇతర ఏజెన్సీలను బలోపేతం చేస్తున్నారని అమిత్ షా చెప్పారు. 2024కి లోగా అన్ని రాష్ట్రాల్లో ఎన్‌.ఐ.ఎ. శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థను నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి తెలియజేశారు.
ఉగ్రవాదంపై పోరులో నిర్ణయాత్మక విజయం సాధించేందుకు, చట్టపరమైన వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని, దీని కింద ఎన్.ఐ.ఎ. చట్టాన్ని, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని, (యు.ఎ.పి.ఎ.ని) సవరించడం ద్వారా వ్యక్తిగత ఉగ్రవాదులను ప్రకటించే నిబంధనను రూపొందించామని చెప్పారు. ఎన్.ఐ.ఎ.కి అదనపు ప్రాదేశిక అధికార పరిధిని ఇచ్చామని, దీనితో పాటుగా ఉగ్రవాదానికి సంబంధించిన/ ఉగ్రవాదం ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేసే హక్కు కూడా ఎన్.ఐ.ఎ.కి దఖలుపరిచామని ఆయన తెలిపారు.
 సైబర్ నేరాలు నేడు దేశానికి, ప్రపంచానికి పెద్ద ముప్పుగా పరిణమించాయని, ఈ సమస్యపై పోరాడేందుకు  కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంసిద్ధంగా ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. నేర శిక్షా స్మృతి (సి.ఆర్‌.పి.సి.), భారతీయ శిక్షా స్మృతి (ఐ.పి.సి.), విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌.సి.ఆర్.ఎ.) వంటి శాసనాల్లో సంస్కరణలపై హోం మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందని, సవరించిన వాటి  బ్లూప్రింట్‌లను త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.
నేర నిర్ధారణ ప్రక్రియ రేటును పెంచడానికి ఫోరెన్సిక్ సైన్స్‌ పరిజ్ఞానాన్ని రాష్ట్రాలన్నీ గరిష్టస్థాయిలో వినియోగించుకోవాలని అమిత్ షా చెప్పారు. సరిహద్దు భద్రత, తీరప్రాంత భద్రత పటిష్టంగా అమలయ్యేలా చూసేందుకు కేంద్ర ఏజెన్సీలతో, భద్రతా దళాలతో మరింత సమన్వయం కోసం సరిహద్దు రాష్ట్రాలు కృషి చేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.