దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. నిందితుల రిమాండ్‌కు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి తిరస్కరించారు. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని తేల్చిచెప్పారు. నిందితులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు.
నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ) 41ఏ సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించవచ్చని సూచించారు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ముగ్గురు నిందితులను సరూర్ నగర్ లోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందుకు గురువారం సాయంత్రం తీసుకురాగా నిందితుల అరెస్ట్ ను ఏసీబీ జడ్జ్ తప్పుపట్టారు. సరైన ఆధారాలు లేవని , ముగ్గురి నిందితులను తక్షణమే విడుదల చేయాలనీ జడ్జ్ తీర్పు ఇచ్చారు.
బుధవారం రాత్రి రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి స్వామీజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం వరకు ఆ ముగ్గురిని విచారించిన పోలీసులు, వైద్య పరీక్షలు చేయించి రాత్రి 9:30 గంటల సమయంలో ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఇంటి వద్ద హాజరుపరిచారు.
పోలీసుల రిమాండ్ రిపోర్టును పరిశీలించిన జడ్జి 3 గంటల పాటు ఇరుపక్షాల వాదనలు విన్నారు. పూర్వాపరాలు పరిశీలించి, ఆ ముగ్గురి రిమాండ్‌కు నిరాకరించారు. వారి అరెస్టు సరికాదని స్పష్టం చేశారు.
‘‘ఈ కేసులో పెట్టిన సెక్షన్లకు అనుగుణంగా సాక్ష్యాధారాలు లేవు. అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి ఈ కేసు రాదు. ఈ కేసులో కేవలం రాజకీయ ఆఫర్లు, సంభాషణలు మాత్రమే ఉన్నాయి. లంచం ఇవ్వజూపిన లేదా తీసుకున్న నగదు లభ్యం కాలేదు’’ అని పేర్కొంటూ నిందితుల రిమాండ్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు.
దాంతో అర్ధరాత్రి 12.30 గంటలకు ముగ్గురినీ విడుదల చేశారు. తోడుగా ఇద్దరు గన్‌మెన్‌లను పంపారు. నగదు దొరకకున్నా, వీడియో ఆధారాలతో అవినీతికి సంబంధించిన సెక్షన్లను పేర్కొంటూ రిమాండ్ రిపోర్టు సిద్ధం చేశారు. జిల్లా, మెజిస్ట్రేట్, సెషన్స్ కోర్టుల్లో కాకుండా, కేసును నేరుగా ఏసీబీ ప్రత్యేక కేసుల కోర్టు ముందు పెట్టారు.
నిజానికి ఏసీబీ కోర్టుల్లో అవినీతికి సంబంధించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే నగదును చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఆదాయానికి మించిన ఆస్తులపై జరిపిన దాడులు, సర్వే నివేదికలను, సీజ్ చేసిన నగదు, నగలు, బ్యాంకు లాకర్లలో లభించిన వాటి వివరాలను ఆధారాలతో సహా సమర్పించాల్సి ఉంటుంది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో అలా జరగలేదు. దాంతో ఏసీబీ కోర్టు ఈ కేసులో రిమాండ్‌ను తిరస్కరించింది.
ఈ సందర్భంగా కోట్ల రూపాయల నగదు పట్టుబడినట్లు మొదట్లో కధనాలు వ్యాపింప చేశారు. అయితే ఫామ్‌హౌ్‌సలో అలా జరగకపోవడం, అసలు నగదు లావాదేవీలు అక్కడేమి జరగక పోవడంతో ఈ కేసు నిలబడలేదు. దానితో ఇదంతా మునుగోడు ఉపఎన్నికలపై ప్రభావం చూపడం కోసం టిఆర్ఎస్ నాయకత్వం తయారు చేసిన నాటకమే అని బిజెపి నాయకులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.
More Stories
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో అండర్‌వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
కర్ణాటకలో పట్టపగలే బ్యాంక్ లో రూ 12 కోట్లు దోపిడీ