కేంద్రం చొరవతో అభివృద్ధికి కేంద్ర బిందువులుగా మారుమూల గ్రామాలు

కేంద్ర ప్రభుత్వ చొరవతో దేశ వ్యాప్తంగా ఉన్న మారుమూల గ్రామాలు, అభివృద్ధికి కేంద్ర బిందువులుగా మారుతున్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాన్సద్ ఆదర్శ గ్రామ యోజన పథకం అనేక గ్రామాల రూపురేఖలు మార్చిందని, ఇందులో భాగంగానే తాను దత్తత తీసుకున్న పెదమైన వాని లంక (పి.ఎం.లంక) గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమె, స్వీయదత్తత గ్రామమైన నర్సాపురం మండలంలోని పి.ఎం.లంక, వీరవాసరం మండలంలోని మత్స్యపురి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో ఎంపి లాడ్స్ రు.1.25 కోట్లు వ్యయంతో నిర్మించిన రాపిడ్ శాండ్ ఫిల్టర్ కేంద్రాన్ని శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు.

అనంతరం నీటి శుద్ది కేంద్రం పనితీరును పరిశీలించారు. ఆ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన అనంతరం అదే ప్రాంగణంలో వున్న మంచినీటి చెరువును సందర్శించి, కొబ్బరి మొక్కని నాటారు.  ఈ నీటి శుద్ధి కేంద్రం ద్వారా వీరవాసరం మండలం మత్స్యపురి, గొడివారి ఆదిఆంధ్ర పేట గ్రామాలలోని 1,110 కుటుంబాలకు శుద్ధిచేసిన త్రాగునీటి సరఫరా కానున్నది.

ఈ నిధులనుశ్రీమతి నిర్మల సీతారామన్ ఎంపిలాడ్స్ నుండి సమకూర్చారు.  అనంతరం ఆమె  దత్తత గ్రామమైన పెదమైన వానిలంక (పి.ఎం.లంక) గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి పి.ఎం.లంకకు వస్తే సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటుందన్న ఆమె, ఈ గ్రామ అభివృద్ధి సంకల్పంలో గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో ఉందని తెలిపారు.

2015లో ప్రధానమంత్రి సన్సద్ ఆదర్శ గ్రామయోజన పథకంలో భాగంగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న నాటి నుంచి  బయో డీ కంపోజింగ్ టాయిలెట్ల నిర్మాణం, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్థుల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సాధారణంగా అన్ని చోట్ల సముద్రపు పోటు ఉత్తరం నుంచి దక్షిణానికి ఉంటే, ఈ గ్రామంలో తూర్పు నుంచి పడమరకు ఉంటుందని, ఈ నేపథ్యంలో గ్రామం సముద్రపు కోతకు గురి కాకుండా నూతన సాంకేతికతతో రూ. 15 కోట్ల వ్యయంతో కిలోమీటరు మేర సముద్రపు కోత లేకుండా పైలట్ ప్రాజెక్టు చేపట్టనట్లు తెలిపారు.

నరసాపురం తీరంలో సముద్ర కోత నివారణకు నిర్మిస్తున్న గోడ సాధారణమైంది కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి గోడలు ఇప్పటి వరకు రెండు చోట్ల మాత్రమే నిర్మించారని తెలిపారు.   పీఎం లంక భవిష్యత్తులో యువతకు పెద్ద శిక్షణా కేంద్రంగా మారబోతుందని ఆమె చెప్పారు.

భవిష్యత్తులోనూ గ్రామాభివృద్ధి కోసం కావలసిన అన్ని చర్యలు చేపడతామని హామీ  ఇస్తూ, ఇందు కోసం రాష్ట్రప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదమైనవాని లంకను నిర్మల దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.