ఆనాడు రజాకార్లను తరిమి కొట్టినట్లే ఇవాళ టీఆర్ఎస్ ను తరిమి కొట్టాలి

ఆనాడు రజాకార్లను తరిమికొట్టినట్లే ఇవాళ టీఆర్ఎస్ ను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలన పోవాలంటే మునుగోడులో బీజేపీకి ఓటేయాలని ఆయన కోరారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా  కిషన్ రెడ్డి  పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తూ  కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి పథకాలతో అవినీతికి పాల్పడి కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగలెత్తిందని ఆరోపించారు.
అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోనే కేసీఆర్ సొంత విమానం కొంటున్నారని చెప్పారు. కోట్లకొద్దీ డబ్బు పంపిణీ చేస్తూ టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ డబ్బులిచ్చిన తీసుకోవాలని ఓటు మాత్రం బీజేపీకే వేయాలని కోరారు.
ప్రజల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, ఆయన్ని గెలిపించాలని  మంత్రి కిషన్ రెడ్డి  విజ్జప్తి చేశారు.  ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని చెబుతూ కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. ఒక్క ఎన్నికలప్పుడు తప్ప మామూలు సందర్భాల్లో కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బయటకి రారని మండిపడ్డారు.
 
టీఆర్‌ఎస్ ప్రభుత్వం మునుగోడు నియోజక వర్గ ప్రజలకు డబ్బు, మద్యం, బిర్యానీ పెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తోందని, అయితే వాటిల్లో దేనికీ ప్రజలు అమ్ముడుపోరని కేంద్ర మంత్రి భరోసా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే తెలంగాణను కేసీఆర్‌ కుమారుడు, మనవడికి రాసిచ్చినట్లేనని ఆయన హెచ్చరించారు. 
 
సీఎం పదవి తన కుటుంబ హక్కులాగా కేసీఆర్ భావిస్తున్నారని కిషన్ రెడ్డి  విమర్శించారు. దేశంలో విమానం కొంటున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అని పేర్కొంటూ  ప్రజల డబ్బుతోనే విమానం కొంటున్నారని ఆరోపించారు. సచివాలయానికి రాని, ప్రజలను కలవని కేసీఆర్ పాలనను చూసి జనం విసిగెత్తిపోయారని ధ్వజమెత్తారు
కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పలపాలు అయ్యిందని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటుతున్నా ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. రోడ్లు, జీపీ భవనాలు, ఇండ్లు, ఉద్యోగాలు లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. మునుగోడు నియోజవర్గంలో మొత్తం ఎన్ని గ్రామాల్లో రోడ్లు, జీపీ భవనాలు నిర్మించారో సీఎం చెప్పాలని నిలదీశారు.
 స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజలు రోడ్డు అడుగుతున్నారంటే సీఎం కేసీఆర్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో యువకులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు
ఇలా ఉండగా,  మొయినాబాద్ ఫాం హౌస్ ఘటనకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని  కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మధ్యవర్తుల ద్వారా నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేసిందని వస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. 
 
టీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతోనైనా లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఫాం హౌస్ కు వెళ్లకముందే టీఆర్ఎస్ సోషల్ మీడియాలో  బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఫాంహౌస్ లో ఎంత డబ్బు దొరికిందో పోలీసులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఫాం హౌస్ కు డబ్బులు తెచ్చుకుంది, పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని ఆరోపించారు.  మొయినాబాద్ పోలీసులు కేసులు నమోదు చేసిన ముగ్గురితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా..? అని ప్రశ్నించారు.
నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తమకు వచ్చే లాభం ఏంటని ఆయన నిలదీసేరు. నలుగురు ఎమ్మెల్యేలు ప్రజాదరణ ఉన్న నాయకులా? అని ప్రశ్నించారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇలాంటి జిమ్మిక్కులు చేసిందని, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా చేస్తోందని ఆరోపించారు. ‘
టీఆర్ఎస్ వ్యవహారం చూస్తుంటే దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్లు చెల్లించి బీజేపీలోకి చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పషం చేశారు. నందు అనే వ్యక్తితో టీఆర్ఎస్ కు చెందిన చాలామంది నాయకులతో సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు.