ఎన్నో అనుమానాలు కలిగిస్తున్న ఎమ్యెల్యేల కొనుగోలు ఆరోపణలు

మునుగోడు ఎన్నికల వేడి నెలకొన్న తరుణంలో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన్నట్లు జరుగుతున్న ప్రచారం అనేక అనుమానాలకు దారితీస్తున్నది. ఈ సంఘటనకు సంబంధించిన వాస్తవాలను కప్పి పుచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
 
తమను లంచంతో ప్రలోభ పెట్టారంటూ ముగ్గురు వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనప్పుడు కేవలం ఆ ముగ్గురిని మాత్రమే పోలీసులు ఎందుకు విచారిస్తున్నారు? ఫిర్యాదు చేసిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు విచారించడం లేదనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
 
ముగ్గురిపై కేసులు నమోదు చేసి, కేవలం వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల సెల్ ఫోన్లను ఎందుకు స్వాధీనం చేసుకోలేదనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
 
తమను ప్రలోభ పెట్టేందుకు స్వామిజీలు వచ్చారని ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు బ్యాగుల్లోని డబ్బును పోలీసులు ఎందుకు చూపించలేదు? ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్ల ఆఫర్ ఇచ్చారంటూ వార్తలు వచ్చినప్పుడు రూ.400 కోట్ల నగదును ఎందుకు చూపించలేదని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
 
అసలు అక్కడ ఎంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారో ఇప్పటి వరకు వెల్లడి కాకపోవడం గమనార్హం.  నిజంగానే స్వామిజీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకుంటే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాం హౌస్ కే ఎందుకు వెళ్తారు? ఎవరికి తెలియని రహస్య ప్రదేశానికి వెళ్తారు కదా? అనే వాదన వినిపిస్తోంది. 
 
కేసులు నమోదైన ముగ్గురు వ్యక్తులు ఏ పార్టీకి చెందిన వారనేది ఇంకా స్పష్టమైన స్పష్టత రావడం లేదు. వారు బిజెపి నాయకుల పక్షాన వచ్చారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పైగా, వారిలో ఒకరైన 
నందు అనే వ్యక్తికి బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే,  టీఆర్ఎస్ కు నాయకులతో నందుకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ కూడా ఆరోపిస్తోంది.
ఈ రెండు పార్టీల నాయకులతో గతంలో నందు దిగిన  ఫొటోలు కొన్ని  ఇప్పుడు బయటకు రావడం గమనార్హం. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, నందు కొన్ని వ్యాపారాల్లో భాగస్వాములని తెలుస్తోంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నందు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారని ప్రచారం సాగుతోంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదుతోనే తాము ఫాం హౌస్ కు వెళ్లామని చెప్పిన సీపీ స్టీఫెన్​ రవీంద్ర రూ.400 కోట్ల నగదును ఎందుకు మీడియాకు చూపించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫాం హౌస్ లో కనిపించిన బ్యాగులు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తనిఖీలు అయిన తర్వాతే బయటకు వస్తాయి కదా? ఒకవేళ బ్యాగుల్లో నగదు ఉంటే అక్కడే అధికారులు చెక్ చేసి, సీజ్ చేసేవారు కదా? మరి అలా ఎందుకు జరగలేదు?
దానితో ఇదంతా కావాలనే టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాగా బీజేపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది.  ఇందులో అసలు వాస్తవం ఏంత..? పోలీసులు ఫాం హౌస్ కు వెళ్లిన తర్వాత అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కలిసి ఒకే కారులో వెళ్లారని, ఆ సమయంలో వారి వెంట గన్ మెన్లు కూడా లేరని తెలుస్తోంది.
నిజంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలను స్వామిజీలు ట్రాప్ చేస్తే, వారితో గతంలో వివిధ సందర్భాల్లో సెల్ ఫోన్లలో మాట్లాడిన ఆడియోలను పోలీసులు గానీ, ఎమ్మెల్యేలు గానీ ఎందుకు బయటపెట్టలేదు? బయటకు వచ్చిన ఫొటోలు, వీడియోల్లో ఎక్కడ కూడా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వామిజీలు, నందు అనే వ్యక్తి ఫామ్ హౌస్ లో ఒకే దగ్గర లేకపోవడం గమనార్హం.
నలుగురు ఎమ్మెల్యేలు ఒక చోట టీ తాగుతూ కనిపిస్తుంటే, ఇద్దరు స్వామిజీలు, నందు మాత్రం మరో చోట కనిపిస్తున్నారు. మరి వీరంతా ఒకేచోట లేనప్పుడు ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వం యెట్లా జరిగినదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఘటన బయటికొచ్చినప్పుడు పోలీసుల కంటే ముందుగానే కొన్ని మీడియా చానెల్స్ ప్రతినిధులు ఫాంహౌస్ కు ఎలా వెళ్లారు? వీరికి సమాచారం ఇచ్చిన వ్యక్తులెవరు? పోలీసుల కంటే ముందుగానే ఎలా చేరుకోగలిగారు? ఈ మొత్తం వ్యవహారం ఉపఎన్నికలు దృష్టిలో ఉంచుకొని సృష్టించిన నాటకీయ పరిణామం అనే ఆరోపణలకు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి.