కోర్టును ఆశ్రయిస్తాం….. సీబీఐ దర్యాప్తు చేయించాలె

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో జరిగిన డ్రామాపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు న్యాయస్తానాన్ని ఆశ్రయిస్టున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామాకు తెరదీశారని పేర్కొంటూ ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామా అంతా జరిగిందని ఆరోపిస్తూ బీజేపీని అకారణంగా బదనాం చేసేందుకు యత్నించిన సదరు పోలీస్ కమిషనర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
మునుగోడు ఎన్నికల్లో మునిగిపోతామనే భయంతో కేసీఆర్ వేసిన ఇలాంటి చిల్లర డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ధ్వజమెత్తారు.  ఎంపీ ధర్మపురి అరవింద్, ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులతో కలిసి సంజయ్ కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో జరిగిన తప్పిదాలు, అక్రమాలను వివరిస్తూ టీఆర్ఎస్ పై బీజేపీ ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. 
ఒక్క ఉప ఎన్నిక గెలిచేందుకు ఇంత డ్రామా ఎందుకు? అని సంజయ్ ప్రశ్నించారు.  మీడియా సైతం వాస్తవాలను బయటపెట్టాలి. దీనివెనుక ఉన్న కుట్రలను చేధించాలని కోరారు. ఎందుకంటే నిజంగా అక్కడ డబ్బులు దొరికితే… ఆ డబ్బును మీడియాకు ఎందుకు చూపలేదు? అని నిలదీశారు.
ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు… ఎమ్మెల్యేలను విచారించడానికి పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకెళ్లలేదు? వాళ్ల స్టేట్ మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు? అని ప్రశ్నించారు.
ఇలా ఉండగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించాలని పిటిషన్ లో కోరారు. కోర్టు పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పోలీసుల వ్యవహార శైలిపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
8 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ బిజెపి పిటిషన్‌ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, సైబారాబాద్‌ సీపీ, రాజేంద్రనగర్‌ ఏసీపీ, మొయినాబాద్‌ ఎస్‌హెచ్‌వో, కేంద్రం, సీబీఐని ప్రతివాదులుగా బీజేపీ చేర్చింది.