భద్రాద్రి రాముడు ఆస్తులను మాఫియా నుండి కాపాడండి 

భద్రాద్రి రాముడు ఆస్తులను మాఫియా ముఠా దురాక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. భద్రాద్రి శ్రీ రాముడికి చెందిన భూములు రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ రాష్ట్రానికి బదిలీ అయిన 7 మండలాలు తూర్పు గోదావరిజిల్లా పరిధిలోకి వచ్చాయని గుర్తు చేశారు.
జిల్లాల విభజనలో అవి శ్రీ అల్లూరి మన్యం జిల్లా, పాడేరు పరిధిలోకి వచ్చాయని, ఈ భూములపై కన్నేసిన ఒక ముఠాలోని కొందరు భాగాలుగా ఏర్పడి ఒక క్రైస్తవ సంస్థ ముసుగులో భూ కబ్జా మాఫియా కన్ను ఈ భూములపై పడిందని ఆయన ఆరోపించారు. వందల కోట్ల ఆస్తిని కబ్జా చేసేందుకు రంగంలోకి దిగిన ముఠా ఎండోమెంట్ అధికారులపై కూడా దౌర్జన్యం చేశారని, ఇప్పటికీ దురాక్రమణ పర్వం కొనసాగుతోందని ఆయన తెలిపారు.
 “శ్రీ రాముడు భూముల కోసం అడిగిన భక్తులను భూములు కావాలంటే రాముడినే రమ్మను” అంటూ ఎగతాళి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఉపముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి తెచ్చానని, మంత్రి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
తెలుగు ప్రజలు అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రి శ్రీ రాములవారి ఆస్తులపై పరాయి మతస్తులు కన్నుపడిందని వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్ల విలువచేసే ఆస్తులు కబళించేందుకు కాచుకు కూర్చున్నారని పేర్కొంటూ దాదాపు 916 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆ దేవుడి పొలాల్లో రాబందుల్లా వాలిపోయారని పేర్కొన్నారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. 
 
రాముడు అంటే విశ్వాసం లేని, హిందూ ధర్మం నుంచి క్రైస్తవ మతం మారిన వ్యక్తులు రాముడిని ఎగతాళి చేస్తూ.. భగవంతుడి భూములు కబ్జా చేస్తున్నారని వీర్రాజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.  అడిగేవారు ఎవరూ లేకపోవడం, ధైర్యం చేసి దేవాలయ అధికారులు అడిగితే కబ్జాదారులు దాడులకు దిగుతున్నారని తెలిపారు. 
దేశానికి స్వాతంత్రం రాకముందు 1867లో పురుషోత్తముడు అనే ఓ రామ భక్తుడు ఆంగ్లేయులు దగ్గర భూములు కొన్నట్లు రికార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పేరు మీదే పాసుపుస్తకాలు కూడా ఉన్నాయని చెప్పారు. కబ్జా విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఇది సివిల్ సబ్జెక్ట్ అని తెలివిగా తప్పించుకుంటున్నారంటే భూములను పధకం ప్రకారం కబ్జాకు అనుకూలంగా మార్చుకుంటున్నారని వీర్రాజు ఆరోపించారు. 
 
 “శ్రీరాముడి భూములు కబ్జా చేస్తే మీకేంటి నష్టం..? దేవుడి ఆస్తులు కావాలనుకుంటే రాముడే స్వయంగా వచ్చి అడుగుతాడు.. మధ్యలో మీరెవరు..? అడగడానికి” అంటూ హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడిని ఎగతాళి చేస్తూ దుర్భాషలాడుతున్నారని తెలిపారు.  ముఖ్యమంత్రి జగన్ వెంటనే జోక్యం చేసుకుని ఆస్తుల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు ఆ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.