చరిత్రలో కలిసిపోయిన టి.ఆర్.ఎస్… ఉనికి కోసం బి.ఆర్.ఎస్. ఆరాటం!

కేవలం తెలంగాణ ప్రజల అస్తిత్వం నినాదంతో ఉనికిలోకి వచ్చి, రెండు  దశాబ్దాలకు పైగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడమే కాకుండా, ఎనిమిది ఏండ్లకు పైగా  అధికారంలో కూడా కొనసాగుతూ వచ్చిన  తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్.)  ఇక చరిత్రలో కలిసిపోయింది. ప్రజా వ్యతిరేకత ఎదురైనప్పుడల్లా `తెలంగాణ సెంటిమెంట్’ రగిల్చి రాజకీయ ఉనికి కాపాడుకుంటూ వస్తున్న ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావుకు ఇప్పుడు ఆ ఆసరా కోల్పోయిన్నట్లయింది. 
 
పార్టీని జాతీయ పార్టీగా మార్చడంతో పాటు, పేరు కూడా భారత్ రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.)గా హడావుడిగా మార్చి వారాలు గడుస్తున్నా కొత్త పేరు ఉనికి ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారుతున్నది. ఆ పార్టీ నేతలే పేరు గురించి తికమక పడటం చూస్తున్నాము.  టిఆర్ఎస్ ఏర్పాటు నేపధ్యం, మనుగడకు దోహదపడే సామజిక, రాజకీయ అంశాలకు ఇప్పుడు ఆ పార్టీ నేతలకు ప్రాధాన్యత లేనట్లు స్పష్టం చేసినట్లయింది. దానితో తెలంగాణ రాజకీయాలలో  ఇక వారి ఉనికి ముగిసినట్లయింది. 
 
ఇప్పటికే జాతీయ రాజకీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలు తమ రాజకీయ ఉనికి కోసం తంటాలు పడుతుంటే, తాజాగా బి.ఆర్.ఎస్. పేరుతో కొత్తగా రాజకీయంగా మనుగడ సాగించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం దేశంలో ఎనిమిది రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. అయితే వాటిలో కేవలం బిజెపి, కాంగ్రెస్ లకు మాత్రమే జాతీయ స్థాయిలో ఉనికి నెలకొంది. 
 
ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, ఎన్సీపీతో సహా మిగిలిన `జాతీయ పార్టీలు’గా పేర్కొంటున్న పార్టీల హోదా ప్రశ్నార్ధకంగా ఉంది. అటువంటి
పరిస్థితులలో ప్రాంతీయ అస్థిత్వవాదంతో ఎదిగిన సంకుచిత రాజకీయ నాయకత్వానికి జాతీయ దృక్పథం వంట పట్టడం  సాధ్యం కాదు. జాతీయ పార్టీగా అయితే ప్రకటించారు గాని అందుకు నిర్దుష్టమైన విధానపరమైన ప్రకటనలు గాని, యంత్రాంగం ఏర్పాటు గాని లేనేలేవు. 
 
టి.ఆర్.ఎస్., బి.ఆర్.ఎస్.గా రూపాంతరం చెందుతున్నదని కేసీఆర్   అధికారిక ప్రకటన చేస్తున్నపుడు జెడియు(సెక్యూలర్) నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార్ స్వామి మినహా చెప్పుకోదగిన ఇతర రాష్ట్రాలకు  చెందిన వారు ఎవ్వరు లేరు. కనీసం, గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై ప్రత్యేకంగా వెళ్ళి కేసీఆర్  సమాలోచనలు జరిపిన మమతా బెనర్జీ, శరద్ పవర్, అఖిలేష్  యాదవ్, అరవింద్ కేజ్రీవాల్,  ఎం కె స్టాలిన్ వంటి నాయకులు ఎవ్వరు కనీసం శుభాకాంక్షలు కూడా తెలపనే లేదు.
 
కుమారస్వామి సహితం కర్ణాటకలో పాత మైసూర్ ప్రాంతంకు పరిమితమైన తన పార్టీ ప్రాబల్యాన్ని కేసీఆర్ తోడ్పడుతో బెంగళూరు మహానగరం, పాత నిజాం పాలనలోని ప్రాంతాలలో విస్తరింప చేసుకోవాలనే ఆలోచన తప్ప బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని చెప్పకపోవడం గమనార్హం. 
 
2019 ఎన్నికలకు ముందు ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేస్తామంటూ బయలుదేరిన కెసిఆర్ మంతనాలు చేసిన బిజూ జనతా దళ్ అధినేత, ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డిఎంకె అధినేత, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి నేతలు ఈ మధ్య కాలంలో కేసీఆర్ వైపే చూడలేదు. ఆయన రాజకీయ ఎత్తుగడల పట్ల వారెవ్వరిలో  నమ్మకం లేకపోవడమే అందుకు కారణం. 
ఇటీవలి కాలంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికంటూ బయలుదేరిన కేసీఆర్ పాట్నాలో ప్రసారమాధ్యమాల ప్రతినిధులతో మాట్లాడుతుండగానే జెడి(యు) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వేదికపై నుంచి లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేయడం గమనార్హం. 
 
టిడిపితో సహా అనేక పార్టీలు తమను జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్నాయి. అయితే వారెవ్వరు తమ రాష్ట్రాల సరిహద్దులు దాటి ప్రభావం చూపలేక పోతున్నారు.  ఎన్నికల కమిషన్ దగ్గర నమోదు చేసుకొన్నంత మాత్రాన ప్రతి పార్టీ జాతీయ పార్టీ అయిపోదు కదా! ఎన్నికల కమీషన్ వద్ద కొన్ని వందల పార్టీలు నమోదు చేసుకొని ఉన్నాయి. అయితే వారెవరికి ఎటువంటి గుర్తింపు లేకపోవడం గమనార్హం.
ఎన్నికల కమిషన్ వద్ద జాతీయ పార్టీగా నమోదు చేసుకోవడం తొలి అడుగు మాత్రమే. టిడిపి వంటి పార్టీలు తమను జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్న పేర్లు మార్చుకొనక పోవడంతో ఇబ్బందులేవీ ఎదురు కాలేదు. అయితే కేసీఆర్ తన పార్టీ పేరునే మార్చుకోవడంతో రాజకీయంగా ఇబ్బందులు అనివార్యం కాగలవు.
తెలంగాణ దాటి ఒక్క సీట్ కూడా గెల్చుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. దానితో పేరు మార్చినా, ఆచరణలో ఓ ప్రాంతీయ పార్టీగానే మనుగడ సాగింప వలసి ఉంటుంది. బిఆర్ఎస్ ఏర్పాటు గురించి జాతీయ మీడియా కూడా పట్టించుకొనక పోవడం గమనిస్తే దేశంలో ఎవ్వరు కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడాన్ని అసలు పరిగణలోకి తీసుకుకోవడం లేదని స్పష్టం అవుతుంది.
పైగా, తెలంగాణ మోడల్ అజెండాగా జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.  గడచిన ఎనిమిదేళ్ళుగా కేసీఆర్ సుపరిపాలన అందించి ఉంటె ఇతర రహస్త్ర ప్రజలకు ఆసక్తి కలిగి ఉండెడిది. కానీ సంపన్న రాష్ట్రాన్ని అప్పులమయం కావించి, ఉద్యోగుల జీతాలు  సక్రమంగా చెల్లించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పైగా,  అవినీతి, అప్రజాస్వామిక పాలనతో అపఖ్యాతి పాలవుతున్నారు.
 
టి.ఆర్.ఎస్.కు తెలంగాణాలోనే నూకలు చెల్లుతున్నాయని సర్వత్రా భావిస్తున్న సమయంలో జాతీయ రాజకీయాలనడం కేవలం తన పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడగానే భావించ వలసి ఉంటుంది.    సమాఖ్య వ్యవస్థను గురించి మాట్లాడే కేసీఆర్ పార్లమెంట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని, అధికారాన్ని చేజిక్కించుకొన్న తర్వాత ఆ చట్టంలో పేర్కొన్న అంశాలు అమలుకు మాత్రం ససేమిా అంగీకరించడం లేదు.
నదీ జలాల వినియోగ అంశం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అనుమతులు లేకుండానే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం, అక్రమంగా జల విద్యుదుత్పాదన, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చినా విద్యుత్ బాకాయిలు చెల్లించక పోవడం, షెడ్యూల్ IX,  X జాబితాలోని ఉమ్మడి ఆస్తుల పంపకం, తదితర అంశాల్లో అంధ్రప్రదేశ్ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న కేసీఆర్ ను ఇతర రాష్ట్రాల  ప్రజలు ఏ విధంగా నమ్ముతారా?
కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో పొరుగు రాష్ట్రం నుండి వైద్యం కోసం వస్తున్న వారిని రాష్ట్ర సరిహద్దుల్లో  పోలీసులతో గెంటేసిన ఆయన వ్యవహారాన్ని ప్రజలు అంత తేలికగా మరచిపోతారా? విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలను సహితం ఖాతరు చేయకుండా అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేయవలసి రావడం తెలిసిందే.