కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశ్ బొమ్మలు… బిజెపి ఎద్దేవా 

కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, గణపతి బొమ్మలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయడం రాజకీయ జిమ్మిక్కు అని బీజేపీ ఎద్దేవా చేసింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ చేస్తున్నారని దుయ్యబట్టింది.
కేజ్రీవాల్ ఢిల్లీలో బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కరెన్సీ నోట్లపై గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలను పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు.  మన కరెన్సీ నోట్లపై లక్ష్మీజీ , గణేష్‌జీ ఫోటో ఉంటే మన దేశం అభివృద్ధి చెందుతుందని కేజ్రీవాల్ సూచించారు. 
 ఇండోనేషియా ముస్లిం మెజారిటీ దేశమని, అక్కడ కేవలం రెండు, మూడు శాతం మాత్రమే హిందువులు ఉన్నారని చెప్పారు. ఆ దేశంలో కరెన్సీ నోట్లపై విఘ్నేశ్వరుడి ఫొటో ఉంటుందని తెలిపారు. ఇండోనేషియా ఆ పని చేసినప్పుడు, మనం ఎందుకు చేయలేమని ప్రశ్నించారు.  మన దేశ కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోతో పాటు లక్ష్మీ దేవి, విఘ్నేశ్వరుడుల ఫొటోలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్  కోరారు. దీనిపై త్వరలోనే తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని చెప్పారు.
దీనిపై బీజేపీ ఎంపీ, ఢిల్లీ బీజేపీ శాఖ మాజీ అధ్యక్షుడు మనోజ్ తివారీ స్పందిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి, ఆ పార్టీ గుజరాత్ శాఖ అధ్యక్షుడు, ఇతర నేతలు హిందూ దేవీ, దేవతలను దూషించారని, అనేక రకాలుగా మాట్లాడారని, అయినప్పటికీ వారు ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో వారి ముఖం చూపించుకోవడం కోసం కొత్త ఎత్తులు ఎత్తుతున్నారని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని వ్యతిరేకించినవారు ఇప్పుడు కొత్త ముసుగు ధరించి వస్తున్నారని ఆరోపించారు.
 
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ, కేజ్రీవాల్ రాజకీయాలు యూ-టర్న్ తీసుకున్నాయని తెలిపారు. కేజ్రీవాల్ కు హిందువులపై అకస్మాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో తెలియడం లేదని విస్మఎం చేశాయం రు. హిందువుల ఓట్ల కోసమే అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
 
 కేజ్రీవాల్ గతంలో కశ్మీర్ ఫైల్స్ మూవీని విమర్శించారనీ, స్వస్తిక్ గుర్తుని హేళన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీపావళి నాడు హిందువులను జైలుకు పంపిన ఘనత కేజ్రీవాల్ దని సంబిత్ పాత్రా ఆరోపించారు. అయోధ్యలోని రామాలయానికి వెళ్లడానికి నిరాకరించిన కేజ్రీవాల్ ఇప్పుడు ఇలాంటి డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 
 అక్కడ చేసే పూజలను దేవుడు స్వీకరించడని ఆయన అన్నారని గుర్తు చేశారు. కశ్మీరు నుంచి పండిట్లు మూకుమ్మడిగా పారిపోవడం అబద్ధమని ఆయన ఎగతాళి చేశారని తెలిపారు.  హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. ఈ రాష్ట్రంలో నవంబరు 12న ఎన్నికలు జరుగుతాయి. గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించవలసి ఉంది.