మహారాష్ట్రలో కొన్ని మున్సిపాలిటీల్లో సొంతంగా బిజెపి పోటీ

మహారాష్ట్రలోని బీజేపీ-ఏక్‌నాథ్ షిండే కూటమి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని మున్సిపాలిటీల్లో సొంతంగా పోటీ చేస్తామని, మరికొన్ని చోట్ల కలిసి పోటీ చేస్తామని  బీజేపీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు.  ముఖ్యమంత్రి షిండే గత ఆగస్టులో తమదే నిజమైన శివసేన అని, తాము, బీజేపీ కలిపి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఫడ్నవిస్ దీనిపై ఈ వివరణ ఇచ్చారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతంలో ప్రకటించిన మున్సిపల్ ఎన్నికలను కోర్టులో సవాలు చేసినందున కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని, అది రాగానే ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ప్రకటిస్తుందని ఫడ్నవిస్ చెప్పారు. ఎన్నికల్లో ఓబీసీ కోటాను ప్రవేశపెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
కొంత గడువు ఇవ్వాలని రాష్ట్రం కోరినప్పటికీ దానిని కోర్టు తోసిపుచ్చుతూ, కోటా లేకుండానే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. బీఎంసీలో సీట్ల సంఖ్యను 236 నుంచి 227కు తగ్గిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మొదట్లో ఆర్డినెన్స్ చేసింది.  దీని రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.  సమృద్ధిగా నిధులున్న బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో సహా రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
త్వరలో మంత్రివర్గ విస్తరణ
 
కాగా,  త్వరలో మహారాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు ఫడ్నవిస్  తెలిపారు. ప్రస్తుతం కేబినెట్ లో సీఎం ఏక్‌నాథ్ షిండేతో సహా 18 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు. మహారాష్ట్రలో మంత్రి మండలిలో గరిష్టంగా 43 మంది సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్న 18 మంది మంత్రులలో షిండే పార్టీ నుండి 9 మంది, బిజెపి నుండి 9 మంది ఉన్నారు.
ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పై తిరుగుబావుటా ఎగరవేసిన ఏక్‌నాథ్ షిండే బిజెపి తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 30న సీఎంగా క్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా ఆగస్టు 9న తొలి మంత్రివర్గ విస్తరణ జరిగింది.