రెండు గంటల పాటు వాట్సాప్ సర్వీసులకు అంతరాయం

భారత్ తో పాటు ప్రపంచంలోని పలు చోట్ల వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది.  మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు దాదాపు రెండు గంటల పాటు ఆగిపోయాయి. మెసేజీల పంపడం, స్వీకరించడం నిలిచిపోయాయి. కనీసం డెలివరీ స్టేటస్ కూడా కనిపించలేదు. 
 
ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ పనిచేయడం లేదు. సర్వర్ డౌన్ అవ్వడంతో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. ఈ వాట్సాప్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మెటా సంస్థ తెలిపింది. 
 
దీంతో, కోట్లాది మంది యూజర్లు గందరగోళానికి గురయ్యారు. ప్రతి దానికి వాట్సాప్ మీదే ఆధారపడి ఉండటంతో… ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి చాలా మంది వెళ్లిపోయారు.  దాంతో వాట్సాప్‌ యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది యూజర్లు వాట్సాప్‌ డౌన్‌ కావడంతో వెంటనే టెలిగ్రామ్‌కు మారారు.
 
ఈ సమస్యపై వర్క్ చేసిన వాట్సాప్ సాంకేతిక బృందం సమస్యను పరిష్కరించింది. సర్వీసులను పునరుద్ధరించింది.  మరోవైపు, సమస్య ఏమిటనేది వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 150 దేశాలు, 60 ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు.
పైగా వాట్సాప్‌ ద్వారా ప్రతి రోజు 10 వేల కోట్ల మెసేజ్‌లు బదిలీ అవుతుంటాయి. రెండు గంటల అంతరాయం తర్వాతనైనా సేవలు పునఃప్రారంభం కావడంతో యూజర్లకు ఉపశమనం లభించింది. దేశ వ్యాప్తంగా 50 కోట్ల డౌన్ లోడ్స్ జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా వాట్సప్ డౌన్ లోడ్స్ జరిగాయి.
వాట్సప్ లో ప్రతి రోజూ 5 కోట్ల 5 లక్షలకు  పైగా వీడియో కాల్స్ జరుగుతున్నాయి. యూజర్లు ప్రతి రోజూ సగటున 23 సార్లు వాట్సప్ ఓపెన్ చేస్తున్నారు . అలాగే ప్రతి రోజూ వాట్సప్ కు సగటున 10 లక్షలకు పైగా కొత్త యూజర్లు వస్తున్నారు.