2030నాటికి దేశంలో పాలు, మాంసానికి భారీ డిమాండ్

కరోనా పరిస్థితుల అనంతరం ప్రజల ఆహారపు అలావాట్లలో వస్తున్న మార్పుల నేపధ్యంలో దేశంలో 2030నాటికి పాలు మాంసం ఉత్పత్తులకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నట్లు నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా పెరుగుతున్న జనాభా కూడా ఇందుకు ఒక కారణంగా తెలిపింది. 

గత మూడు దశాబ్ధాల నుంచి దేశంలో జానాభా వృద్ధి రేటు 1.57శాతంతో పోలిస్తే పట్టణ జనాభా వృద్ధి రేటు 2.64శాతం ఉన్నట్టు నివేదిక తెలిపింది. దేశ జనాభాలో మూడింట ఒక వంతు నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారు. ఈ ప్రభావంతో ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి.

గత రెండు దశాబ్ధాలుగా పట్టణాల్లో తలసరి పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 10 శాతం పెరిగినట్టు నాబార్డు నివేదిక వెల్లడించింది. గుడ్ల వినియోగం 13 శాతం, మాంసం, చేపల వినియోగం 25 శాతం పెరిగిందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపల వినియోగం కూడా పట్టణ ఆహారపు అలవాట్లతో పోటీ పడుతున్నట్టు తెలిపింది.

గ్రామీణ ప్రాంతాల్లో గుడ్ల వినియోగం వేగంగా పెరుగుతూ 45.5 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. 2030 నాటికి దేశంలో పాల డిమాండ్ 65.2 శాతానికి, మాంసం డిమాండ్ 75.5 శాతానికి, గుడ్ల డిమాండ్ 65.7 శాతానికి, చేపల డిమాండ్ 75 శాతానికి పెరుగుతుందని నాబార్డు అధ్యయన నివేదిక అంచనా వేసింది.

దేశంలో ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో పంటల సాగుకు ధీటుగా పశుపోషణలో మహిళలే కీలకంగా మారారు. పశుపోషణ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇంటి అవసరాలు సరిపడే విధంగా వినియోగిస్తూ బడ్జెట్ సూత్రాన్ని వంటబట్టించుకుంటున్నారు. తద్వారా మహిళా సాధికారతను చాటుతున్నారు. 

కుటుంబ జీవన విధానాలను పేదరికం నుంచి బయటపడేటంలో కూడా మహిళలు కుటుంబ నిర్వహణ యాజమాన్య బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతున్నట్టు నాబార్డు అధ్యయ నివేదికలో బయటపెట్టింది. కుటుంబ బడ్జెట్ నిర్వహణలో ప్రధానంగా పిల్లలకు పోషకాహారం అందజేయటం, ఆరోగ్య సంరక్షణ, విద్యకు ప్రధాన్యత ఇవ్వటంలో మహిళలు తమ కుటుంబ భవిష్యత్తునే కాకుండా దేశ భవిష్యత్తుకు కూడా దోహదపడుతున్నట్టు నివేదిక వెల్లడించింది.