కఠిన నిర్ణయాలకు సిద్ధం కావాలని రిషి సునాక్ పిలుపు

రానున్న రోజుల్లో కఠిన నిర్ణయాలకు బ్రిటన్ ప్రజలు సిద్ధం కావాలని బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ తన తొలి ప్రసంగంలోని పిలుపునిచ్చారు. అప్పుల సమస్య పరిష్కారాన్ని రానున్న తరాలకు వదిలేయబోనని స్పష్టం చేశారు. లిజ్ ట్రస్ ద్వారా జరిగిన తప్పిదాలను సరిచేయడానికే తాను ప్రధాని అయినట్లు రిషి సునాక్ చెప్పారు.
 
దాదాపు 200 ఏండ్ల పాటు భారత్‌లో వలస పాలన సాగించిన బ్రిటన్‌లో భారత సంతతి నేత రిషి సునాక్‌.. ఆ దేశ ప్రధానిగా మంగళవారం ప్రమాణం చేశారు. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌కు వెళ్లి కింగ్‌ చార్లెస్‌-3తో సమావేశమయ్యారు. చార్లెస్‌-3 ఆహ్వానం మేరకు క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు.
లిజ్ ట్రస్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవడం, రిషి సునాక్‌ను ప్రధాని బాధ్యతలు స్వీకరించడం అంతా నిమిషాల్లో జరిగిపోయాయి.  అంతకు ముందు బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ చివరి ప్రసంగం చేశారు. బ్రిటన్ కష్టకాలంలో ఉందని అయితే అతి త్వరలోనే మళ్లీ కోలుకుంటుందనే విశ్వాసం ఆమె వ్యక్తం చేశారు. తనకు బ్రిటన్ పౌరులపై నమ్మకముందని చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా కొత్తగా ఎన్నికైన రిషి సునాక్‌కు ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు.
బ్రిటన్ రాణికి జాతి అంతిమ వీడ్కోలు పలికిన సమయంలో తాను బ్రిటన్ ప్రధానిగా ఉండటం తనకు గౌరవనీయమని విషయమని లిజ్ ట్రస్ చెప్పుకున్నారు. పుతిన్‌పై ఉక్రెయిన్ ధైర్యంగా పోరాడుతోందని, అందరూ ఉక్రెయిన్‌కు మద్దతునీయాలని ఆమె సూచించారు. అంతేకాదు బ్రెగ్జిట్ వల్ల సొంతంగా ప్రయోగాలు చేసి ప్రయోజనాలు పొందాలని ఆమె సలహాఇచ్చారు.
ప్రధానిగా చివరి ప్రసంగం చేశాక లిజ్ ట్రస్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు కింగ్ చార్లెస్ IIIను కలిసేందుకు వెళ్లారు. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక లిజ్ ట్రస్ అధికార కన్సర్వేటివ్ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. కన్సర్వేటివ్ పార్టీ తరపున రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్యే పోటీ జరిగింది. చివరకు లిజ్ ట్రస్ విజేతగా నిలిచారు.
వెయిటర్ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన రిషి సునాక్ బ్రిటన్ చరిత్రలోనే ప్రధాని బాధ్యతలు స్వీకరించిన అత్యంత పిన్న వయస్కుడు. పైగా, 210 సంవత్సరాల బ్రిటన్ పరిపాలనలో తొలి హిందూ ప్రధాని కూడా సునాక్. గతంలో కన్జర్వేటివ్‌ పార్టీ నేత బోరిస్‌ జాన్సన్‌ క్యాబినెట్‌లో మంత్రులుగా రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌లు పని చేశారు.