నేడే సూర్యగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత

సూర్యగ్రహణం సందర్బంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను మూసి వేస్తున్నారు. సూర్యగ్రహణం సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:42 గంటలకు ముగుస్తుంది. అంటే దాదాపు 1:15 నిమిషాల పాటు గ్రహణం భారతదేశంతో పాటు ఇది ఐరోపా, ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య భాగం, ఆసియాలోని నైరుతి భాగం, అట్లాంటిక్‌లో కూడా కనిపిస్తుంది. 
 
గ్రహణం సమయంలో 43 శాతం సూర్యడు ఆస్పష్టంగా కనిపించనున్నాడు. పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించాలనుకునే వారు తప్పనిసరిగా సోలార్ గాగూల్స్ ను ఉపయోగించాలి.  ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న చోటు చేసుకోనుంది. కాకపోతే దీన్ని మన దేశంలో వీక్షించలేం. తిరిగి 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది.
యాదాద్రి ఆలయాన్ని ఇవాళ ఉదయం 8:50 నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నారు. నేడు జరిగే నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేశారు. రేపు నిర్వహించాల్సిన శత ఘటాభిషేకం, సహస్ర నామార్చన, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. రేపు ఉదయం 10:30 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.

భద్రాద్రి రామాలయాన్ని ఇవాళ ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు మూసివేయనున్నారు. వేములవాడలో రాజన్న ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. సుప్రభాత సేవ తర్వాత రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేస్తారు. సాయంత్రం 5:35 గంటల తర్వాత సంప్రోక్షణ, పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.

జగిత్యాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం తిరుమంజనం నిర్వహించి, భక్తులకు సర్వ దర్శనానికి అనుమతిస్తారు. ధర్మపురి ఆలయాన్ని నిత్యారాధన, నివేదన అనంతరం మూసివేయనున్నారు.

అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయంలో నిర్వహించాల్సిన చండీ హోమాన్ని రద్దు చేశారు. వరంగల్‌లో భద్రకాళి అమ్మవారి, హనుమకొండలో వేయి స్తంభాల గుడిని ఉదయం 9 గంటలకే మూసివేయనున్నారు. రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు.

తిరుమలలో ఉదయం 8 నుంచి రాత్రి 7:30 గంటలకు వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కనకదుర్గమ్మ ఆలయ తలుపులు మూసివేయనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించి, ఆలయాన్ని తెరవనున్నారు.

రేపు ఆలయంలో అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. విశాఖ సింహాచలం, శ్రీకాకుళం అరసవల్లి ఆలయాలను కూడా మూసివేయనున్నారు.