బ్రిటన్‌ ప్రధానిగా తోలి హిందూ రిషి సునాక్ !

బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ సోమవారం చరిత్ర సృష్టించారు. యావత్ భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్‌ వైదొలగడంతో బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి నేతగా నిలిచారు.
తాను హిందువునని గర్వంగా చెప్పుకుంటారు. బ్రిటన్ ఎంపీగా భగవత్ గీతపై ప్రమాణ స్వీకారం చేశారు. అత్తా, మామలు మినహా ఆయనకు తన వైపు నుండి భారత్ లో ఎవ్వరు బంధువులు లేరు. అయితే హిందూ ఆచారాలను సగర్వంగా పాటిస్తుంటారు.
రిషి సునాక్‌.. అధికార 357 మంది పార్టీ ఎంపీల్లో సగానికి పైగా ఎంపీల మద్దతు కూడగట్టుకున్నారు. ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి, కొన్ని వందల ఏండ్ల పాటు భారత్‌లో వలస పాలన సాగించింది బ్రిటన్‌. కానీ, ఈనాడు అదే వలస పాలన దేశమైన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఈ నెల 28న   బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనుండడం కొత్త చరిత్రను సృష్టించడమే కానుంది.
 
రిషి సునాక్‌ పూర్వీకులు పంజాబ్‌ రాష్ట్రం వారు. 1980 మే 12న బ్రిటన్‌లోని సౌథాంప్టన్‌లో రిషి సునాక్‌ జన్మించారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా అందుకున్న రిషి. అంతకుముందు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకానమీ కోర్సుల్లో పట్టా అందుకున్నారు. 
 
2001-04 మధ్య గోల్డ్‌మాన్‌ సాక్‌లో విశ్లేషకుడిగా సేవలు అందించారు. రెండు హెడ్జ్‌ కంపెనీల్లో పని చేశారాయన. ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి సునాక్‌ పెండ్లి చేసుకున్నారు.  రిషి సునాక్‌ తొలిసారి 2014లో రిచ్‌మండ్‌ నుంచి బ్రిటన్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2017, 2019 ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాలో రిషి సునాక్‌ పేరు నమోదైంది.
 
తొలుత బ్రిటన్‌ సహాయ మంత్రిగానూ, తర్వాత క్యాబినెట్‌ మంత్రిగా, చాన్స్‌లర్‌గా పని చేశారు. బ్రిటన్‌ చాన్స్‌లర్‌గా పని చేసిన తొలి భారతీయుడిగానూ రిషి సునాక్‌ చరిత్ర నెలకొల్పారు. ఆయనకు ఫుట్‌బాల్‌, క్రికెట్‌, ఫిట్‌నెస్‌, సినిమాలు అంటే ఎంతో ఇష్టం. బోరిస్‌ జాన్సన్‌ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పని చేసిన రిషి సునాక్‌. నాయకుడి వ్యవహారశైలిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
కరోనా మహమ్మారి ఉధృతి వేళ జాన్సన్‌ అనుసరించిన వైఖరి వివాదాస్పదమైంది. స్కామ్‌లలోనూ బోరిస్‌ జాన్సన్‌ చిక్కుకున్నట్లు తేలడంతో ఆర్థిక మంత్రిగా రిషి సునాక్‌ రాజీనామా చేశారు. తర్వాత జాన్సన్‌ క్యాబినెట్‌లో అత్యధికులు వైదొలిగారు. దీంతో బోరిస్‌ జాన్సన్‌ ప్రధానిగా రాజీనామా చేయాల్సి వచ్చింది.
 
బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయగానే ప్రధాని పదవి రేసులో తానూ ఉన్నట్లు ముందే ప్రకటించారు రిషి సునాక్‌. కానీ తన వెన్నంటి ఉంటూ తనకు వెన్నుపోటు పొడిచాడన్న అనుమానంతో రిషి సునాక్‌ను బోరిస్‌ జాన్సన్‌ వ్యతిరేకించారు. లిజ్‌ ట్రస్‌ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. తొలి దశలో రిషి సునాక్‌కు ఎంపీలు మద్దతు తెలిపినా, తర్వాతీ దశల్లో తగ్గుముఖం పట్టింది. 
 
మెజారిటీ అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు రిషి సునాక్‌కు మద్దతు ఇచ్చినా పార్టీ సభ్యులు లిజ్‌ ట్రస్‌ వైపు మొగ్గు చూపారు. సంపన్నులపై పన్నుల్లో కోత విధిస్తానని లిజ్‌ ట్రస్‌ చేసిన వాగ్ధానం అందరినీ ఆకర్షించింది. కానీ, ఇతర దేశాల మాదిరిగానే బ్రిటన్‌లోనూ ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. కరోనా తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో పరిస్థితులు విషమించాయి.
ద్రవ్యోల్బణం అదుపు తప్పడంతో పన్ను రేట్లు తగ్గిస్తానని లిజ్‌ ట్రస్‌ చేసిన ప్రకటన వికటించింది. మినీ బడ్జెట్‌ ప్రతిపాదించడంలోనే అవకతవకలు ఉండటంతో ఆర్థిక మంత్రిని తప్పించారు లిజ్‌ ట్రస్‌. తర్వాత బ్రిటన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ చాన్స్‌లర్‌ను ఆర్థిక మంత్రిగా నియమించినా, చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటామని లిజ్ ట్రస్‌ విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా 45 రోజులకే ప్రధాని పీఠం నుంచి లిజ్‌ ట్రస్‌ వైదొలిగారు.
 లిజ్‌ ట్రస్‌ వారసుడిగా రిషి సునాక్‌ పోటీ పడ్డారు. తొలుత బోరిస్‌ జాన్సన్‌ బరిలో ఉంటానన్నా, 58 మంది ఎంపీలే బాసటగా నిలవడంతో పార్టీ ఐక్యత కోసం తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పెన్నీ మోర్డాంట్‌ చివరి వరకు పోటీలో ఉన్నా, మద్దతు కూడగట్టలేక వైదొలిగారు.