బ్రిటిష్ ప్రధానిగా మొదటిసారి భారత సంతతి రిషి సునాక్ ఎన్నిక 

బ్రిటన్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖితమైంది. తొలిసారిగా  ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు. మెజారిటీ పార్లమెంటు సభ్యుల మద్దతు లభించడంతో ఆయనను ప్రధానిగా, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ప్రకటించారు. తగినంత మంది ఎంపీల మద్దతు లేకపోవడంతో రిషి ప్రత్యర్ధి పెన్నీ మోర్డాంట్ చివర్లో పోటీ నుంచి వైదొలిగారు. 

రిషికి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నుంచి తీవ్ర పోటీ ఎదురతుందని భావించినప్పటికీ ఆయన అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్నారు. దీంతో రిషి సునాక్  ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమం  అయింది.  ఈ ఎన్నికలో బ్రిటన్ మాజీ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ సైతం రిషి సునాక్ కే మద్దతు ప్రకటించడం విశేషం.

బ్రిటన్ పార్లమెంట్‌లో అధికార కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల సంఖ్య 357 కాగా రిషి సునాక్‌కు 188 మంది సభ్యులు మద్దతు ప్రకటించారు. రేసులో ఉంటారనుకున్న యూకే హౌస్ ఆఫ్ కామన్స్ నాయకురాలు పెన్నీ మోర్డాంట్‌ వంద మంది సభ్యుల మద్దతు కూడగట్టడంలో విఫలం కావడంతో సునాక్‌కు పోటీయే లేకుండా పోయింది.

బ్రిటన్ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన 45 రోజులకే లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో ఈ మధ్యంతర ఎన్నిక వచ్చింది. దీంతో గతంలో జరిగిన ప్రధాని ఎన్నికలో లిజ్ ట్రస్ చివరిదాకా బలమైన పోటీ ఇచ్చిన రిషి సునాక్ వైపు అందరి దృష్టి మళ్లింది. బ్రిటన్ మీడియా కూడా తదుపరి ప్రధాని రిషియే అంటూ కథనాలు ప్రచురించాయి. సర్వే నివేదికలు విడుదల చేశాయి. 

ఎట్టకేలకు వాటిని  నిజం చేస్తూ రిషి బ్రిటన్ ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్నారు.  అమెరికా అధ్యక్షుడైన తొలి నల్లజాతీయుడిగా 2008 సంవత్సరంలో బరాక్ ఒబామా చరిత్ర సృష్టించారు. తాజాగా బ్రిటన్ లోనూ రిషి ఇలాంటి కొత్త చరిత్రే లిఖించారు. 

రిషి సునాక్ తల్లితండ్రులు యశ్విర్, ఉషా సునాక్. 1950వ దశకంలో వారుభారత్ నుంచి తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. అక్కడ ఫార్మసిస్టులుగా స్థిరపడ్డారు. అయితే మెరుగైన ఉపాధి అవకాశాలను అన్వేషిస్తూ వారు 1960వ దశకంలో బ్రిటన్ లోకి అడుగుపెట్టారు. సౌతాంప్టన్ నగరంలో ఉండగా యశ్విర్, ఉషా సునాక్ దంపతులకు 1980 మే 12న రిషి  జన్మించారు.  

రిషి విద్యాభ్యాసం  చాలావరకు బ్రిటన్ లోనే జరిగింది. ఉన్నత విద్య కోసం అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లిన ఆయనకు నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తి పరిచయమయ్యారు. ఇద్దరి స్నేహం ప్రేమగా మారడంతో 2009 బెంగళూరులో పెద్దల సమక్షంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. రిషి, అక్షత దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. 11 ఏళ్ల కృష్ణ, 9 ఏళ్ల అనౌష్క. 

2015లో తొలిసారి యార్క్ షైర్ స్థానం నుంచి బ్రిటన్ పార్లమెంటుకు ఎంపికైన సమయంలో ఆయన భగవద్గీత మీద ప్రమాణం చేశారు. అంచెలంచెలుగా కన్జర్వేటివ్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. బోరిస్ జాన్సన్ ప్రధాని పగ్గాలు చేపట్టాక ఆయనకు పాలనా వ్యవహారాల కీలక సలహాదారుగా వ్యవహరించారు. ఈ క్రమంలో క్లిష్టమైన కరోనా సంక్షోభ సమయంలో (2020లో) అత్యంత కీలకమైన బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి పదవిని రిషి చేపట్టారు. 

దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే ఎన్నో సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. దీర్ఘకాలిక వ్యూహంతో ఆర్థిక ప్రణాళికలుకు రూపకల్పన చేయడంలో రిషి తనకు తానే సాటి అని అంటుంటారు.