బహిష్కృత పాక్ జర్నలిస్టు అర్షద్ షరీఫ్ కెన్యాలో కాల్చివేత

బహిష్కృత పాక్ జర్నలిస్టు అర్షద్ షరీఫ్ కెన్యాలో కాల్చివేత
పాకిస్తాన్ ప్రముఖ న్యూస్ యాంకర్లలో ఒకరైన అర్షద్ షరీఫ్ కెన్యాలో కాల్చివేతకు గురయ్యారు. ఆ విషయాన్ని షరీఫ్ భార్య ధ్రువీకరించారు. కొద్ది నెలల క్రితం షరీఫ్‌పై దేశద్రోహ ఆరోపణలు మోపడంతో ఆయన అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పాక్ నుంచి పారిపోయారు.
 
పాకిస్థాన్ మిలటరీ విమర్శకులలో ఒకరిగా, గత ఏడాది పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం కారణంగా పదవి కోల్పోయిన మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుగా షరీఫ్‌‌కు పేరుంది. ”నా మిత్రుడిని, భర్తను, ఇష్టమైన జర్నలిస్టును ఈరోజు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం ఆయన కెన్యాలో కాల్చివేతకు గురయ్యారు” అని షరీఫ్ భార్య జవెరియా సిద్ధిఖి ట్వీట్ చేశారు.
 
అయితే, ఆదివారం రాత్రి మగాడి పట్టణం నుండి దేశ రాజధాని నైరోబీకి ప్రయాణం చేస్తుండగా పోలీసులు  పొరపాటున కాల్చి చంపినట్లు కెన్యాకు చెందిన వార్త పత్రిక ది స్టార్ పేర్కొన్నది. పోలీసుల రోడ్ బ్లాక్ ను ఉల్లంఘించినందుకు అతనిని, అతని డ్రైవర్ ను కాల్చినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. 
 
అతని కారుతో పోలి ఉన్న కారులో ఓ బాలుడిని అపహరించుకు పోతుండగా పోలీసులు ఆపారని, షరీఫ్ తన గుర్తింపు కార్డు చూపించే ప్రయత్నం చేసినా, డ్రైవర్ ఆపకుండా వేగంగా ముందుకు వెళ్లడంతో పోలీసులు వెంబడించి, కాల్పులు జరిపారని చెబుతున్నారు. 
 
అయితే ఈ సంఘటనపై న్యాయవిచారణ జరిపించాలని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. అతనిని దేశం విడిచేటట్లు చేశారని, విదేశాలలో దాక్కొంటున్నా సోషల్ మీడియా ద్వారా నిజాలు వెల్లడిస్తూ ఉండడంతో `తగు మూల్యం’ చెల్లించాడని అంటూ పేర్కొన్నారు. 
 
గత ఏడాది ఆగస్టులో సీనియర్ ప్రతిపక్ష నేత షబాజ్ గిల్‌ను షరీప్ ఇంటర్వ్యూ చేశారు. మెజారిటీ అభిప్రాయాలకు భిన్నంగా సాయుధ బలగాల్లోని జూనియర్ ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారని, ఉత్తర్వులను పెడచెవిని పెడుతున్నారని షబాజ్ గిల్ వ్యాఖ్యానించారు. గిల్ వ్యాఖ్యలు న్యూస్ ఛానెల్స్‌లో ప్రసారం చేయగానే షరీఫ్‌కు అరెస్టు వారెంట్ జారీ అయింది. 
 
దాంతో ఆయన దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. కెన్యాలో ఆర్షద్ షరీఫ్ కాల్చివేతకు గురయ్యారని, పోలీసులు విచారణ జరుపుతున్నారని ఏఆర్‌వై న్యూస్ ఛానెల్ ఒక ట్వీట్‌లో తెలిపింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా షరీఫ్ మృతిని ధ్రువీకరించింది.