ప్రపంచంలో రాజకీయంగా రాణిస్తున్న భారత సంతతి నేతలు

ఇప్పటివరకు ప్రపంచంలోని మేటి కార్పొరేట్‌ సంస్థలకు అధిపతులుగా భారత సంతతి నిపుణులు రాణిస్తున్నరు. ఆ జాబితాలోని రాజకీయ నేతలు కూడా చేరారు.  భారతీయ మూలాలు, భారత సంతతి వ్యక్తులు పలువురు ప్రపంచంలోని పలు దేశాల్లో రాజకీయంగా రాణిస్తున్నారు. 
 
అమెరికా నుంచి పోర్చుగల్‌ వరకు పలు దేశాల్లో భారత సంతతి రాజకీయ వేత్తలు కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. ఆ జాబితాలోకి ఇప్పుడు రిషి సునాక్‌ చేరారు.
 
జో బైడెన్‌ ప్రభుత్వంలో అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా దేశ చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ రికార్డు నెలకొల్పారు. కమలా హ్యారిస్‌ పూర్వీకులు తమిళనాడులో పుట్టి పెరిగారు.
 
మారిషస్‌ ప్రధాని ప్రవీణ్‌ జుగ్నాథ్‌.. భారత సంతతి వారే. ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు ఆయన పలు మంత్రివర్గాల్లో కీలక శాఖలు నిర్వహించారు. 2017 నుంచి మారిషస్ అధ్యక్షుడిగా పృద్విరాజ్‌సింగ్ రూపన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారతీయ ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో రూపన్ పుట్టారు.
 
ప్రస్తుత పోర్చుగల్‌ ప్రధాని అంటోనియో కోస్టా..భారత సంతతి వారే. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయన పూర్వీకులు గోవాలో పుట్టి పెరిగారు.
 
చంద్రికపెర్సద్ ‘చన్’ సంటొఖి 2020 నుంచి సూరినామ్ దేశానికి ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. 1959లో ఇండో-సూరినామ్ హిందూ కుటుంబంలో జన్మించారు. మాజీ పోలీసు అధికారి అయిన ఈయన ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం సూరినామ్ 9వ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
 
మహ్మద్ ఇర్ఫాన్ అలీ 2020 ఆగస్టు 2 నుంచి గయానా 9వ ఎగ్జిక్యూటివ్‌గా ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో ఆయన పుట్టారు.

రిషి సునాక్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు 

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ సమస్యల పై, 2030 రోడ్ మ్యాప్ పై ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ  తెలిపారు. భారత్, బ్రిటన్ ల మధ్య చారిత్రక సంబంధాలను ఆధునిక బంధాలుగా మారుద్దాం అని ప్రధాని తన ట్వీట్ లో తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటన్ లోని భారతీయులకు మోదీ  దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.