జనసేన పార్టీపై వైసీపీ ప్రభుత్వం కొత్త కుట్ర

‘‘జనసేన పార్టీపై వైసీపీ ప్రభుత్వం శనివారం సాయంత్రం నుంచి కొత్త కుట్ర మొదలుపెట్టిందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.  పోలీసులు, ఇంటెలిజెన్స్‌ నివేదిక అంటూ సమాచాన్ని మీడియాకు ఇచ్చి, కొత్త కుట్రల ప్రచారం మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. 
 
‘పోలీస్‌, ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక… జనసేన పార్టీ శ్రేణులు 13 మంది వైసీపీ ప్రజా ప్రతినిధులపై ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉంది… అంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా సాగుతున్న ప్రచారం… వైసీపీ ప్రభుత్వం కుట్ర. దీనిని జనసేన తీవ్రంగా ఖండిస్తోంది’’ అని మనోహర్‌ ఒక వీడియే ప్రకటన విడుదల చేశారు.
 
 రాష్ట్ర పోలీస్‌ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు నిజమే అయితే కచ్చితంగా డీజీపీ దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ఇంటెలిజెన్స్‌ నివేదికలు మీడియాకు ఎలా వెళ్లాయో దర్యాప్తు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎవరి ద్వారా ఈ తప్పుడు ప్రచారాలు బయటకు వెళ్తున్నాయో తమకు సమాచారం ఉందని ఆయన చెప్పారు. 
 
జనసేన పార్టీకి రోజు రోజుకీ జనాదరణ పెరగడం చూసి అసూయ చెందుతున్న అధికార పక్షం ఇంటి కుట్రలకు తెర లేపుతోందని మనోహర్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కొత్త కుట్రలు మొదలుపెట్టిందనే విషయాన్ని జనసైనికులు గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. ఎన్నికలు ఎంతో దూరంలో లేవని చెబుతూ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా తేల్చుకునేందుకు జనసేన సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. 
 
 జనసైనికులు ఎప్పుడూ జనసేనాని చెప్పిన గీత దాటరని చెబుతూ ప్రజా పోరాటాలను కచ్చితంగా జనసేన పార్టీ చేస్తుందని ఆయన వెల్లడించారు. వాటిని ఎక్కడా అప్రజాస్వామిక పద్ధతుల్లో మాత్రం చేయదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ కుట్రలను జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు బలంగా తిప్పికొట్టలని మనోహర్‌ కోరారు.