ఆర్బీఐ స్వల్పకాలిక రుణాలలో అగ్రస్థానంలో తెలుగు రాష్ట్రాలు 

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) నుంచి స్వల్పకాలిక రుణాలు తీసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టుకల్లా ఆర్బీఐ అందజేసే మూడు రకాల స్వల్పకాలిక రుణాల్లో ఆంధ్రప్రదేశ్‌ రూ. 4,304 కోట్లు, తెలంగాణ రూ. 2,792 కోట్ల మేర అప్పులు తీసుకున్నాయి.
ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన ‘ఆర్బీఐ రిపోర్ట్‌: అక్టోబరు-2022’ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇలా తరచూ స్వల్పకాలిక రుణాలు తీసుకునే రాష్ట్రాలు ఒకట్రెండు నెలల్లోనే దుష్ప్రభావాలను ఎదుర్కొంటాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రాష్ట్రం ఆర్బీఐ వద్ద కొంత మొత్తాన్ని రిజర్వ్‌ చేస్తుంది. ఆ మొత్తం నుంచి కావాల్సినప్పుడు స్వల్పకాలిక(5 రోజుల నుంచి 14 రోజులు) రుణాలు తీసుకుంటుంది.
ఆర్బీఐ స్వల్పకాలిక రుణాల్లో మూడు రకాలున్నాయి. అవి.. స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ(ఎ్‌సడీఎఫ్‌), వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సె్‌స(డబ్ల్యూఎంఏ), ఓవర్‌ డ్రాఫ్ట్‌(ఓడీ). వీటిల్లో ఎస్‌డీఎ్‌ఫపై వడ్డీ స్వల్పంగా.. అంటే.. 3.2 శాతం నుంచి 4.2 శాతం వరకు ఉంటుంది. అందుకే రాష్ట్రాలు ఎస్‌డీఎఫ్‌ వైపు మొగ్గుచూపుతుంటాయి. మిగతా రెండు రకాల్లో బ్యాంకు వడ్డీకి 2 శాతం అధికంగా ఉంటాయి.
ఎస్‌డీఎఫ్‌, డబ్ల్యూఎంఏలను ఐదు రోజులకు, ఓడీని 14 రోజుల కాలానికి తీసుకోవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక నెలలో ఆర్థిక సమతౌల్యత సరిగ్గా లేనప్పుడు ఈ తరహా రుణాలు తీసుకోవచ్చు. అయితే ఈ ఏడాది ఆగస్టు వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎస్‌డీఎఫ్‌ నుంచి రూ. 712 కోట్లు(133 రోజులకు), డబ్ల్యూఎంఏ నుంచి రూ. 1,773 కోట్లు(122 రోజులకు), ఓడీ ద్వారా రూ. 1,819 కోట్లు(51 రోజులకు)– మొత్తం రూ. 4,304 కోట్ల మేర స్వల్పకాలిక రుణాలు తీసుకుంది.
 ఆ తర్వాతి స్థానంలో ఉన్న తెలంగాణ ఎస్‌డీఎఫ్‌ నుంచి రూ. 735 కోట్లు(152 రోజులకు), డబ్ల్యూఎంఏ ద్వారా 1,206 కోట్లు (138 రోజులకు), ఓడీ ద్వారా రూ. 851 కోట్లు(58 రోజులకు)– మొత్తం రూ. 2,792 కోట్ల మేర తీసుకుంది. ఈ తరహా రుణాలు పెరిగిపోతే ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆ తర్వాత ఓడీలకు అవకాశాలను నిలిపివేస్తుంది. అదే జరిగితే సంబంధిత రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటాయి.
ఆర్థిక క్రమశిక్షణను పాటించని రాష్ట్రాలే ఆర్బీఐ స్వల్పకాలిక రుణాలకు వెళ్తాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ)కు చెందిన ఆర్థికవేత్త సోనాల్‌ బధన్‌ వెల్లడించారు. ‘‘ఏ రాష్ట్రమైనా ఆర్బీఐ స్వల్పకాలిక రుణాలు తీసుకోవచ్చు. అయితే.. ఆ రుణం తీర్చేలోగా అంతే మొత్తంలో ఆదాయం రానుందని రాష్ట్రాలు స్పష్టం చేయాల్సి ఉంటుంది. కానీ, చాలా రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణను కోల్పోయి, ఆర్థిక సమతౌల్యం లోపించి స్వల్పకాలిక రుణాలకు వెళ్తాయి” అని తెలిపారు.
“రాబడుల కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పరిస్థితులు నెలకొంటాయి. రుణాలు తీసుకున్నాక.. ఆశించిన మేర రాబడులు లేకపోతే ఒకట్రెండు నెలల్లోనే దాని దుష్ప్రభావాలు ఎదురవుతాయి’’ అని ఆమె వివరించారు. రాష్ట్రాల స్వల్పకాలిక రుణాల ప్రభావం ఎక్కువగా ఉద్యోగుల జీతాల విడుదల, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులపై ప్రత్యక్ష్యంగా కనిపిస్తాయని మరో ఆర్థికవేత్త వివరించారు.