9 మంది వీసీల రాజీనామాకు కేరళ గవర్నర్‌ ఆదేశం

కేరళలోని 9 యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లు వెంటనే రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదేశించారు. సోమవారం ఉదయం 11.30 లోపు రాజీనామా పత్రాలు తనకు అందాలని స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్‌ స్వయంగా ఆదివారం చేసిన ట్వీట్‌ కలకలం రేపింది.
గవర్నర్‌ చేసిన ట్వీట్‌లో అక్టోబర్‌ 24లో ఉదయం 11.30 లోపు రాజీనామాలు చేయాలని కేరళలోని తొమ్మిది యూనివర్శిటీల వైస్‌ఛాన్సలర్లకు లేఖలను ఇామెయిల్‌ ద్వారా పంపినట్లు పేర్కొన్నారు.
కేరళ యూనివర్శిటీ, ఎంజి యూనివర్శిటీ, కొచిన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కేరళ యూనివర్శిటీ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఒషన్‌ స్టడీస్‌, ఎపిజె అబ్దుల్‌ కలాం టెక్నాలజికల్‌ యూనివర్శిటీ, శ్రీ శంకరాచార్య సంస్కృత్‌ యూనివర్శిటీ, కాలికుట్‌ యూనివర్శిటీ, తుంచత్‌ ఎజుథచన్‌ మలయాళం యూనివర్శిటీ, కన్నూర్‌ యూనివర్శిటీల విసిలకు గవర్నర్‌ ఈ మేరకు లేఖలు పంపారు.
కేరళలోని ఏపీజే అబ్దుల్‌ కలాం టెక్నాలాజీకల్‌ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎం ఎస్ రాజశ్రీ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాజీనామా లేఖలు కోరారు. దీంతో ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
వర్సిటీ వీసీ నియామకానికి సెర్చ్‌ కమిటీ ముగ్గురి పేర్లు సూచించాలని, కానీ అబ్దుల్‌ కలాం వర్సిటీ వీసీ విషయంలో ఇలా జరుగలేదని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది. దానితో రాష్ట్రంలో వైస్ ఛాన్సలర్ల నియామకంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ రూపొందించిన నిబంధనల ఉల్లంఘన జరిగిన్నట్లు గవర్నర్ తన ఆదేశంలో స్పష్టం చేశారు.
వైస్ ఛాన్సలర్ల నియామకానికి ముగ్గురు నుండి ఐదుగురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సూచించి ఉంటె, వారిలో ప్రతిభ గలవారిని ఎంపిక చేసే అవకాశం గవర్నర్ కు ఉండెడదని, కానీ ఒకే  పేరును పంపించడంతో గవర్నర్ కు అటువంటి అవకాశం లేకుండా పోయినదని రాజ్ భవన్ వర్గాలు ఈ సందర్భంగా తెలిపాయి.
కాగా, గవర్నర్‌ ఇచ్చిన అల్టిమేటంను కన్నూరు విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ గోపినాథ్‌ రవీంద్రన్‌ తిప్పికొట్టారు. తానే రాజీనామా చేసేది లేదని ఆయన ప్రకటించారు. తనని బర్తరఫ్‌ చేయాలని సవాల్‌ చేశారు. మిగిలిన విసిలు కూడా ఇదే బాట నడవనున్నారని సమాచారం.
గవర్నర్ ఆదేశాల పట్ల రాష్ట్రంలో అధికారంలో ఉన్న సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ ఆదేశాన్ని పట్టించుకోవద్దని వైస్ చాన్సలర్లను కోరినట్లు తెలుస్తున్నది. ఆ విధంగా ఈ విషయమై రాజకీయ, న్యాయపర పోరాటానికి అధికార పక్షం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది.  ఆ పార్టీ రాష్ట్ర కమిటీ విడుదల చేసిన ప్రకటనలో గవర్నర్‌ ప్రజాస్వామ్యంలో అన్ని హద్దులను దాటిపోయారని ఆరోపించింది. ఈ అప్రజాస్వామిక చర్యకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తామని ప్రకటించింది.
ఇలా ఉండగా,  ప్రతిపక్ష నాయకుడు వి కె సతీషన్ గవర్నర్ చర్యను సమర్ధించారు. రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిన ఓ పొరపాటును గవర్నర్ సరిదిద్దారని, అందుకే తాను స్వాగతిస్తున్నానని తెలిపారు.