భారతీయులతో కలిసి కమలా హ్యారిస్ దీపావళి సంబరాలు

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నేవల్ అబ్సర్వేటరీలోని తన అధికారిక నివాసంలో దసరా వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయ సంతతి వారు హాజరయ్యారు. అమెరికాలోని ప్రముఖ భారతీయులందరినీ కమలా హ్యారిస్ దంపతులకు ఆతిథ్యమిచ్చారు. 
 
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జో బిడెన్ సీనియర్ సలహాదారు నీరా టాండెన్,  అమెరికన్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి, ; రిచ్ వర్మ, భారతదేశంలోని అమెరికా మాజీ రాయబారి రిచ్ వర్మ, ఆసియా అమెరికన్లపై ప్రెసిడెంట్ బిడెన్స్ అడ్వైజరీ కమిషన్ కమిషనర్ అజయ్ భూటోరియా లతో సహా పలువురు ప్రముఖ భారతీయ-అమెరికన్‌లు పాల్గొన్నారు.
కమలా హారిస్, సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసిన వీడియోలలో, తన భర్తతో కలిసి దీపాలను వెలిగిస్తూ, ఒకరికొకరు ఆనందిస్తూ, దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ  కనిపించారు.  ఈ సందర్భంగా అధికారులు కమలా నివాసాన్ని దీపాలు, వివిధ రకాల లైట్లతో గొప్పగా అలంకరించారు. 
 
తన తల్లి చెన్నైలో జన్మించగా, డాక్టరేట్ చేసేందుకు అమెరికా వెళ్లి, అక్కడనే స్థిరపడిన భారత సంతతికి చెందిన కమలా హారిస్ మాట్లాడుతూ దిపావళి పండుగ గొప్పదనం విశ్వవ్యాప్తమైనదని ఆమె తెలిపారు.
 
 ‘‘అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యక్షురాలిగా నేను వీటి గురించి ఆలోచిస్తుంటా. అయితే.. చీకటి తరిమేసి వెలుగులను ఆహ్వానించే శక్తి మానవాళికి ఉందన్న దీపావళి లాంటి పండుగలు గుర్తు చేస్తుంటాయి’’ అని కమలా హ్యారిస్ తెలిపారు. 
 
 245 ఏళ్ల అమెరికా చరిత్రలో మొదటిసారిగా ఎన్నికైన నల్లజాతి దక్షిణాసియా మహిళ, దేశ ఉపాధ్యక్షురాలు హారిస్‌తో కలసి సంప్రదాయ దక్షిణాసియా పర్వదినాన్ని జరుపుకోవడం ఆనందంగా, గౌరవంగా ఉందని  ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మఖిజా సంతోషం వ్యక్తం చేశారు. 
 
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన, 2,500 సంవత్సరాలకు పైగా చరిత్ర గల ఓ పర్వదినాన్ని అధికారికంగా జరుపుకోవడం పట్ల బిడెన్ పాలనా యంత్రాంగంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ లో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న సమయంలో దక్షిణాసియా సంతతికి చెందిన వారు కీలక పాత్ర వహించే అవకాశం ఉన్నందున దీపావళి పర్వదినాన్ని అమెరికాలో పలు చోట్ల అధికారికంగా జరుపుకోవడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. 
అమెరికాలో భారతీయ సంతతి వారి ప్రభావం, ప్రభావం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ క్రమంలోనే దిపావళి పండుగ అమెరికాలో ఓ ముఖ్యవేడుకగా ప్రాముఖ్యం సంతరించుకుంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నేతలు దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్‌ల అధికారిక నివాసాల్లోనూ దీపావళి వేడుకలు జరిగాయి.
ట్రంప్ స్వగృహంలో దీపావళి సంబరాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వగృహం మార్ ఏ లాగో (ఫ్లోరిడా రాష్ట్రం)లో పలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి దీపావళి వేడుకలను శాస్త్రోక్తంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.  
అనాదిగా చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు. సమస్త మానవాళి శాంతి సౌభ్రాతృత్వంతో మెలగాలని ఆకాంక్షించారు. దీప ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమంలో పలు ప్రధాన విషయాలను ట్రంప్ ప్రస్తావించారు. భారతదేశం, అమెరికా దౌత్య సంబంధాలు, పరస్పర సహాయ సహకారాలు ఉన్నత శ్రేణిలో కొనసాగాలని ఆకాంక్షించారు.
అంతేకాకుండా 2016 ఎన్నికల్లో తన వెంట ఉండి బలపరచిన రిపబ్లికన్ హిందూ సమాఖ్య నాయకులను, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఈ సహకారం ఇలాగే కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. తాను అధికారంలోకి వస్తే.. సమాఖ్య సభ్యులను ప్రభుత్వ కార్య నిర్వహణలో భాగస్వాములను చేస్తానని హామీ ఇచ్చారు. షల్లీ కుమార్‌ను భారత రాయబారిగా నియమించనున్నట్టు తెలిపారు.
భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూల దృక్పథాన్ని అవలంభించి ఉగ్రవాదం మూలాలను వేరిపారేయడంలో సహాయం చేయనున్నట్టు వెల్లడించారు. భారతీయులు శాంతి కాముకులని, ఎలాంటి పరిస్థితులలోనైనా కష్టపడి సానుకూల దృక్పథంతో సాగే స్వాభావమే ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. భారతీయుల పట్ల, హిందువుల సంస్కృతీ, సంప్రదాయాలపట్ల తనకు ఎనలేని గౌరవం ఉందని చెప్పారు.