కమలం పూలతో ఇంటింటా సంజయ్ వినూత్న ప్రచారం

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చౌటుప్పల్ పట్టణంలో వికసించిన కమలం పూలు చేతబట్టి ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేయాలంటూ ప్రచారం చేశారు.
 
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, పార్టీ రాష్ట్ర ఉఫాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డిలతో కలిసి చౌటుప్పల్ లోని వీధుల్లో తిరిగారు. గడపగడపకూ వెళ్లి ఓటర్లకు స్వయంగా కమలం పూలు అందజేసి పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 
 
దానితో దీపావళి పర్వదినం రోజున బీజేపీ నేతల్లో జోష్ నెలకొంది. ఎక్కడ చూసినా కమలం పూలు చేతబట్టి ఎన్నికల ప్రచారం చేయడం కన్పించింది. సంజయ్ వెంట భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 
 
మరోవైపు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా దీపావళి రోజున బీజేపీ అగ్ర నేతలంతా కమలం పూలు చేతబట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఇంఛార్జ్ జి.వివేక్ వెంకటస్వామి సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు మునుగోడు మండలంలో వికసించిన కమలం పూలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  
 
ఇలా ఉండగా, చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ మంత్రి కేటీఆర్ ప్రధానికి పోస్ట్ కార్డు రాయడంపై సంజయ్ మండిపడ్డారు.  చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆరేనని పేర్కొన్నారు. ఈ విషయంపై కేటీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగులను మీడియా ఎదుట ప్రదర్శించారు. 
 
‘‘ఇదిగో వీడియో… ట్విట్టర్ టిల్లు దీనికేం సమాధానం చెబుతావ్? జీఎస్టీ సమావేశంలో పాల్గొన్నదెవరు? అక్కడ ఏం చెప్పినవ్.. చేనేతపై 5 శాతం జీఎస్టీ వేయాలని కేంద్రాన్ని కోరింది నువ్వే కదా. మరి రద్దు చేయాలని చెప్పకుండా ఏం పీకినవ్?’’అని దుయ్యబట్టారు. 
 
చేనేత వస్త్రాలకు అద్దే రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఆ హామీని నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.   ‘‘గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి, మంత్రులు మునుగోడు ప్రజలకు అనేక హామీలిచ్చారు? వాటిలో ఎన్ని నెరవేర్చారు?” అని ప్రశ్నించారు.
వాటిని ఎందుకు నెరవేర్చలేదో మునుగోడు ప్రజలకు సమాధానం చెప్పకుండా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తుండటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. పైగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు, గోల్డ్ బిస్కెట్లు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.