రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ

మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. తమ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం చండూరులో ఆదివారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో గతంతో పోలిస్తే దేశం నేడు ఏ స్థాయిలో ఉందో యువత, విద్యావంతులు గమనించాలని కోరారు. 
 
గతంలో దేశ యువత ఇతర దేశాలపై ఆశలు పెట్టుకుని ఉండేవారని, మోదీ నాయకత్వంలో ప్రపంచంలో ఉన్న గొప్పగొప్ప కంపెనీలన్నీ దేశంలోనే పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోదీ రైతు పక్షపాతి, రైతు బాంధవుడని పేర్కొన్నారు. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పథకాల కోసం రూ.25వేల కోట్లు ఖర్చు పెట్టి, మద్యం ద్వారా రూ. 45 వేల కోట్లు గుంజుతున్నాడని సంజయ్ విమర్శించారు. మునుగోడులో కేసీఆర్‌ను ఓడిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని స్పష్టం చేశారు. పోటీచేసే అభ్యర్థుల్లో ఆదుకునే వారెవరో, దోచుకునే వారెవరో మునుగోడు ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. 
 
రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగిస్తూ, మునుగోడుపై దండుపాళ్యం ముఠా మోహరించి మరింత దోపిడీ చేస్తుందని బీజేపీ నేత విమర్శించారు. మునుగోడులో డబుల్‌ బెడ్రూం ఇళ్లకు ఇప్పటి వరకు స్థల సేకరణ చేయలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి ప్రతీ బీజేపీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపిచ్చారు.  టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు తెలిపిన కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను కేసీఆర్‌ పాదాల దగ్గర ఫణంగా పెట్టారని విమర్శించారు. 
 
“మునుగోడులో గొల్ల కురుమలకు గొర్ల పైసలు అడ్డుకున్నట్లు, నేను ఈసీకి లేఖ రాసినట్లు టీఆర్ఎస్ వాళ్లు ప్రచారం చేస్తున్నరు. నేను గొర్ల పైసలు అడ్డుకోలేదు. పేదలకు వచ్చే పథకాలను అడ్డుకునే తత్వం కాదు నాది. ఈ విషయంపై తడిబట్టలతో నా భార్యా పిల్లలతో కలిసి దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తా.. నువ్వు సిద్ధమా?” అని సీఎం కేసీఆర్‌‌కు సంజయ్ సవాల్ చేశారు.
 
 హైదరాబాద్‌లో ఉంటున్న మునుగోడు ఓటర్లతో ఆదివారం నాగోల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ మాట్లాడుతూ మునుగోడులో ధర్మయుద్ధం జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ ఆర్థిక సాయం చేస్తోందని, టీఆర్ఎస్ ఇచ్చే నిధులతోనే కాంగ్రెస్ మునుగోడు బైపోల్ ప్రచారం చేస్తోందని సంజయ్ ఆరోపించారు. కమ్యూనిస్టులు ఎర్ర గులాబీలుగా మారిపోయారని, సీపీఐ జాతీయ మహా సభలకు టీఆర్ఎస్ నిధులు సమకూర్చినట్లు తమవద్ద సమాచారం ఉందని స్పష్టం చేశారు.