ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్లు రిషి సునాక్‌ ప్రకటన

బ్రిటన్‌ ప్రధాన మంత్రికి పోటీలో ఉన్నట్లు ఆ దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ ఆదివారం ధృవీకరించారు. ‘యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఒక గొప్ప దేశం. కానీ మనం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం’ అని రిషి సునాక్‌ ట్వీట్‌ చేశారు. ‘అందుకే నేను కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడిగా, మీ తదుపరి ప్రధానమంత్రిగా పోటీలో నిలబడతాను’ అని భారత సంతతి వ్యక్తి, కన్జర్వేటివ్‌ పార్టీ నేత సునాక్ తెలిపారు. 
 
తన నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రతి స్థాయిలో సమగ్రత, వృత్తి నైపుణ్యం, జవాబుదారీతనం వుంటుందని, పనులు పూర్తి చేయడానిక ప్రతీ రోజూ పని చేస్తామని రిషి సునాక్‌ తెలిపారు. మనం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి స్పష్టమైన ప్రణాళిక ఉన్నట్లు తెలిపారు.
 
 ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌ అనూహ్య రాజీనామాతో కొత్త ప్రధానిని ఎన్నుకొనే ప్రక్రియ ప్రారంభం కావటంతో మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను రిషి ఈసారి నేరుగా ఢీకొట్టనున్నారు. నాలుగు నెలల క్రితం వరకు బోరిస్‌ ప్రధానిగా, ఆయన మంత్రివర్గంలో రిషి ఆర్థిక మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. 
 
బోరిస్‌ రాజీనామా తర్వాత ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌తో తుదకంటా పోరాడి రిషి ఓడిపోయారు. అయితే, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడలేకపోయిన లిజ్‌ 45 రోజులకే ప్రధాని పదవికి రాజీనామా చేయటంతో ఇప్పుడు బోరిస్‌, రిషి ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. 42 ఏళ్ల సునాక్‌కు కన్జర్వేటివ్‌ పార్టీలోని 128 మంది సభ్యుల మద్దతు ఉన్నట్టు ఆయన వర్గం చెబుతోంది. 
 
ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సుయెల్లా బ్రావరెమన్‌ కూడా సునాక్‌కు మద్దతు తెలిపారు మరోవైపు మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా.. తనదైన శైలిలోపావులు కదుపుతున్నారు. ఆయనకు కూడా 100 మంది సభ్యుల మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. 
 
సోమవారంలోగా ఎంపీలు తాము మద్దతిచ్చే అభ్యర్థుల తరఫున ఈ మెయిల్‌, లేదా భౌతికంగా నామినేషన్లు సమర్పించాలని  బ్రిటన్‌ పార్లమెంటు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రధానిగా ఎన్నికయ్యేందుకు కనీసం 100 మంది మద్దతు అవసరం.