సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాక్తో జరిగిన మ్యాచ్ లో 82 పరుగులు చేసి, భారత్ కు ఉత్కంఠభరితమైన విజయాన్ని తీసుకొచ్చిన విరాట్ కోహ్లీ ఈ  సందర్భంగా అనేక రికార్డులను శైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. తద్వారా సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. 
 
సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో 23 అర్ధ సెంచరీలు సాధించగా, కోహ్లీ తాజా అర్ధ సెంచరీతో ఆ రికార్డును తిరగరాశాడు. కోహ్లీ ఇప్పటి వరకు 24 అర్థ సెంచరీలు సాధించాడు. దీంతో ఐసీసీ టోర్నీల్లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
 
టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. పాక్తో జరిగిన మ్యాచ్లో 82 పరుగులు చేయడం ద్వారా టీ20ల్లో టాప్ స్కోరర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్  రోహిత్ శర్మను దాటేశాడు. 
 
ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ  110 మ్యాచుల్లో 3,794 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ -3,741 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ -3,531 రన్స్తో మూడో ప్లేస్లో, బాబర్ ఆజమ్- 3,231 పరుగులతో నాల్గో స్థానంలో,  పాల్ స్టిర్లింగ్-3,119  పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
 
పాక్పై అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుంది విరాట్ కోహ్లీనే. ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్పై కోహ్లీ అత్యధికసార్లు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. మొత్తం మీద  ఎక్కువ సార్లు ప్లేయర్ ఆఫ్ ది  మ్యా్చ్ అవార్డులు గెలుచుకున్న వారిలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.
 
టీ20ల్లో ఎక్కువసార్లు 50కి పైగా పరుగులు చేసిన  రికార్డును కోహ్లీ నెలకొల్పాడు. 35 సార్లు 50కి పైగా పరుగులు సాధించాడు.  అంతేకాకుండా టీ20ల్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ 18 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. అందుకే కోహ్లీ ఉన్నాడంటే ఎంత పెద్ద లక్ష్యమైనా చిన్నదైపోతుంది. 
 
భావోద్వేగానికి గురైన కోహ్లీ 
 
ఓటమి అంచుల నుంచి విజయాన్నందుకోవడం.. ఈ విజయంలో తన పాత్ర ఉండటంతో విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న ఆనంద బాష్ఫాలను ఆఫుకోలేకపోయాడు. మ్యాచ్ అనతంరం విరాట్ మాట్లాడుతూ  తన 14 ఏళ్ల కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటూ తెలిపాడు.  
 
గెలిచిన వెంటనే విరాట్‌ 3-4 సార్లు కసిగా పిడికిలితో నేలను బలంగా కొట్టాడు. ఈ క్రమంలో జట్టు సభ్యులంతా ఒక్కసారిగా మైదానంలోకి వచ్చి కోహ్లీని చుట్టుముట్టడంతో అతని కళ్లు చెమర్చాయి. తడారని కళ్లతో ఆకాశం వైపు చూస్తూ విజయనాదంతో ఉప్పొంగిపోయాడు. 
 
ఈ మ్యాచ్‌లో ఎలా ఆడానో కూడా చెప్పడానికి మాటలు రావడం లేదని కోహ్లీ చెప్పాడు. అంతేకాదు.. ఈ విజయానందంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. విరాట్‌ను భుజాలపైకెత్తుకొని గిరగిరా తిప్పాడు.  మ్యాచ్ గెలిపించినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి.