యుద్ధం చిట్టచివరి అస్త్రం, శక్తి లేనిదే శాంతి అసాధ్యం

యుద్ధం అనేది చిట్టచివరి అస్త్రమని, శక్తి లేనిదే శాంతి సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిహద్దు జవాన్లకు దీపావళి సందేశం ఇచ్చారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి సరిహద్దు భద్రతా దళాలతో దీపావళి వేడుకలు జరుపుకొంటున్న ప్రధాని, ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ కార్గిల్‌లో వీర జవాన్లను సోమవారంనాడు కలుసుకున్నారు.
సైనికులను ఉద్దేశించి ప్రసింగిస్తూ, దేశ భద్రతకు అంకితమై వారు చేస్తున్న కృషి, సేవలను శ్లాఘించారు. వారిని ఉత్తేజపరిచారు. ఇండియన్ ఆర్మీలోకి మహిళల ప్రవేశంతో మన శక్తి మరింత పెరిగిందని మోదీ ప్రశంసించారు. ”యుద్ధం చిట్టచివరి అస్త్రంగానే మనం భావిస్తుంటాం. అది లంకలో కావచ్చు, కురుక్షేత్రంలో కావచ్చు. యుద్ధాన్ని నివారించేందుకు చివరి వరకూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంటాం. ప్రపంచ శాంతినే మనం కోరుకుంటాం” అని మోదీ పేర్కొన్నారు.
పాకిస్థాన్‌తో యుద్ధమనేదే లేకుంటే విజయాన్ని చవిచూసేవాళ్లం కామని తెలిపారు. కార్గిల్‌లో ఉగ్రవాదాన్ని తమ సైనికులు ఉక్కుపాదంతో అణిచివేశారని, దానికి తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పారు. సైనికులంతా తన కుటుంబ సభ్యులని, వారు లేకుండా తాను దీపావళి చేసుకోలేనని చెప్పారు. తీపి, వెలుగుల సంగమంగా దీపావళి వేడుకను వారి మధ్య జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని తెలిపారు.
భారత్ ను  ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ గౌరవిస్తున్నాయని, సైనికులు సరిహద్దులను రక్షిస్తుంటే, శత్రువులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ప్రధాని చెప్పారు. మనకు సవాలు ఎదురైతే శత్రువులకు ఏ భాషల్లో తగిన గుణపాఠం చెప్పాలో మన సాయుధ బలగాలకు బాగా తెలుసునని కొనియాడారు.
 
ఉగ్రవాదంపై పోరును కొనియాడుతూ.. వారి ధైర్యానికి ద్రాస్, బటాలిక్, టైగర్ హిల్ సాక్ష్యాలుగా నిలిచాయని ప్రధాని చెప్పారు. కార్గిల్‌లో మన సైనికులు తీవ్రవాదాన్ని అణిచివేశారని, ఆ ఘటనకు తానే సాక్షినని చెప్పారు. ఆర్మీ బలగాలను చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్న మోదీ . జవాన్లకు స్వీట్లు తినిపిస్తూ దీపావళి సంబరాలు జరుపుకున్నారు.  
సరిహద్దులు భద్రంగా ఉంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంటుందని చెబుతూ గత ఏడెనిమిది ఏళ్లలో భారత ఆర్థిక పరిస్థితి 10వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుందని తెలిపారు. యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్‌లో మన దేశవాసులకు భారత పతాకం రక్షణ కవచంలో నిలిచిందని చెప్పారు. గత ప్రభుత్వాల అవినీతి, తప్పిదాలు అభివృద్ధికి ఆటంకంగా నిలిచాయని పరోక్షంగా మోదీ విమర్శించారు.
 ఈరోజు అవినీతిపై దేశం నిర్ణయాత్మక పోరు జరుపుతోందని, అవినీతిపురులు ఎంత శక్తివంతులైనా తప్పించుకోలేరని, తమను తాము కాపాడుకోలేరని ప్రధాని స్పష్టం చేశారు. జవాన్లతో కలిసి మోదీ ఫోటోలు దిగారు. సైనికులు ”వందేమాతారం, భారత్ మాతాకీ జై” నినాదాలు హోరెత్తించగా, ప్రధాని సైతం దేశభక్తి నినాదాలు చేస్తూ వారిని మరింత ఉత్తేజపరిచారు.
ఉత్తరాఖండ్‌ సరిహద్దు గ్రామమైన మనలో కూడా ప్రధాని పర్యటించి సరిహద్దు భద్రతా దళ సిబ్బందితో దీపావళి వేడుకల్లో పాల్గోనున్నారు. గత ఏడాది జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్‌లో సైనికులతో కలిసి ప్రధాని దీపావళి వేడుకలు చేసుకున్నారు.