తెగింపుతో పోరాడాలి, సాహసంతో గెలవాలి… జిన్‌పింగ్ పిలుపు

తెగింపుతో పోరాడాలని, సాహసంతో గెలవాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. కఠోర శ్రమతో పని చేయాలని, ప్రతికూల పరిస్థితులకు చలించి పోవద్దని, దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్ళాలని దిశానిర్ధేశం చేశారు. 

ఐదేళ్లకోసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ  ధైర్యంగా గెలవాలని, తలలు వంచి కష్టపడాలని, నమ్మకంతో ముందుకు సాగాలని జీ జిన్‌పింగ్‌ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సుమారు 2300 మంది పార్టీ నేతలు సమావేశాల్లో పాల్గొన్నారు.

చైనాను కట్టడి చేయాలని, స్తంభింప చేయాలని, బ్లాక్ మెయిల్ చేయాలని ప్రమాదకరంగా అంతర్జాతీయ పరిస్థితులు మారుతున్న సమయంలో జాతీయ ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. 

చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశాలు బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్’లో వారం రోజుల పాటు జరిగాయి. మూడవ సారి దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు కావాల్సిన మార్పుల్ని చేస్తూ జిన్‌పింగ్‌ చేసిన తీర్మానానికి ఆమోదముద్ర పడినట్లు తెలుస్తోంది.

శనివారం జరిగిన సమావేశాల అనంతరం 200 మంది సీనియర్‌ పార్టీ నేతలతో కొత్త సెంట్రల్‌ కమిటీని ఎంపిక చేశారు. జిన్‌పింగ్‌ పనితీరును మెచ్చుకుంటూ ప్రతినిధులు ఓటేశారు. కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. 

పార్టీ జనరల్‌ సెక్రటరీగా జీ జిన్‌పింగ్‌ను ఆదివారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మళ్లీ ఆయన్నే జనరల్ సెక్రటరీగా ప్రకటిస్తే, అప్పుడు జీ జిన్‌పింగ్‌ మూడవసారి అధ్యక్ష పదవికి పోటీపడేందుకు లైన్‌ క్లియర్ అవుతుంది.మార్చిలో జరిగే ప్రభుత్వ వార్షిక లెజిస్లేటివ్ సెషన్స్‌లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుంది. 

రెండుసార్లు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న కమ్యూనిస్టు పార్టీ నియమాన్ని 2018లో రద్దు చేశారు. మావో తర్వాత మూడోసారి పార్టీ నాయకత్వం చేపట్టిన తొలి నేతగా జిన్‌పింగ్ చరిత్ర సృష్టింపనున్నారు. మిగిలిన వారంతా రెండు పర్యాయాలు, పదేళ్ళపాటు పనిచేసి విరమించుకున్నారు.

తోలుత నవంబర్, 2012లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జిన్‌పింగ్, అక్టోబర్, 2017లో తిరిగి రెండోసారి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆదివారం మూడోసారి ఎన్నిక కానున్నారు.

25 మంది సభ్యులుండే పార్టీ పాలిట్‌బ్యూరోలో మార్పులు, చేర్పులకు, చైనాలో అత్యున్నత అధికారంగల ఏడుగురు సభ్యులతో కూడిన పాలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ కూర్పునకు నూతన సెంట్రల్ కమిటీ ఆమోదం తెలుపుతుంది. వీటిలో జీ జిన్‌పింగ్ సన్నిహితులే ఉంటారని తెలుస్తోంది.