బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్ ముందంజ!

అనూహ్య పరిణామాలు, క్యాబినెట్ తిరుగుబాటు అనంతరం ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ 45 రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేయడంతో బ్రిటన్ లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహించేందుకు బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరు? అనే చర్చ మొదలైంది. 
 
ట్రస్ వారసురాలిగా దేశానికి నాయకత్వం వహించేందుకు ఎంపీ పెన్నీ మోర్డాంట్ రేసులోకి వచ్చారు. సహచరుల మద్దతు ఉందని చెబుతూ ఆమె ఆధికారికంగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. మోర్డాంట్ గత ఎన్నికల్లోనే ప్రధాని అభ్యర్థిగా రేసులో నిలిచారు. కానీ, రిషి సునాక్, లిజ్ ట్రస్‌ల చేతిలో ఓడిపోయారు.
అయితే, లిజ్ ట్రస్ నిష్క్రమణ తర్వాత కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, యూకే తదుపరి ప్రధాన మంత్రిగా మారడానికి భారత సంతతికి చెందిన రిషి సునాక్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో తన అనాలోచిత నిర్ణయాలతో ప్రధాని పీఠాన్ని వదులుకున్న బోరిస్ జాన్సన్ కూడా విహార యాత్రను విరమించుకొని యూకే తిరిగి వచ్చాడు. 

ఆయన తిరిగి పదవి చేపట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024లో జరిగే సాధారణ ఎన్నికలలో తిరిగి పార్టీ గెలుపొందాలంటే తన నాయకత్వం అవసరమని పార్టీ సహచరులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో లిజ్ ట్రస్ కు గట్టి పోటీ ఇచ్చిన రిషి సునాక్ ను కూడా పోటీ పడవద్దని కోరినట్లు తెలుస్తున్నది.

 దాంతో, యూకేలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.పెన్నీ మోర్డాంట్ అధికారికంగా ప్రధాని రేసులోకి వచ్చిన తర్వాత పార్టీ, జాతీయ ప్రయోజనాల కోసం నాయకత్వం కోరుకునే సహోద్యోగుల నుండి తనకు మద్దతు లభించిందని పేర్కొన్నారు.

అయితే, రిషి సునాక్, బోరిస్ జాన్సన్ ఇంకా తమ ప్రచారాలను అధికారికంగా ప్రారంభించలేదు. లిజ్ ట్రస్ స్థానంలో బ్రిటన్ ప్రధాని పదవిని మరోసారి బోరిస్ జాన్సన్‌ను అధిష్ఠించనున్నారని ప్రీతిపటేల్ వెల్లడించారు. భారత సంతతికి చెందిన ప్రీతి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్‌లోబ్రిటిష్ సెక్రటరీగా సేవలందించారు. ప్రీతి శనివారం మాట్లాడుతూ తమ మాజీ బాస్ జాన్సన్ ప్రధాని ట్రస్ స్థానాన్ని భర్తీ చేయనున్నారని తెలిపారు.

రిషి సునాక్‌కు పోటీకి కనీసం అవసరమైన 100 మంది ఎంపీల మద్దతు ఇప్పటికే సమకూరింది. సోమవారం జరిగే తొలి రౌండ్ ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఒక్కో అభ్యర్థికి కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం.

ప్రస్తుతానికి, 22 మంది ఎంపీలు పెన్నీ మోర్డాంట్‌కు మద్దతు ఇవ్వగా, 48 మంది ఎంపీలు బోరిస్ జాన్సన్ తిరిగి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. పార్లమెంటులో 357 మంది టోరీ ఎంపీలు ఉన్నారు కాబట్టి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వంద మంది ఎంపీల మద్దతు ఒకే వ్యక్తికి ఉంటే తనే తదుపరి ప్రధాని అవుతారు.

గతంలో ఆర్ధిక మంత్రిగా పనిచేయడం, ఆర్ధిక వ్యవహారాలపై స్పష్టమైన అజెండాను ప్రజల ముందుంచ గలగడంతో, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభంలో రిషి సునాక్ నాయకత్వం పట్ల పార్టీలో ఎక్కువమంది మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.