న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో అట్టహాసంగా దీపావళి వేడుకలు

న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో అట్టహాసంగా దీపావళి వేడుకలు
అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలలో నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, సెనెటర్ ఛుక్ షుమార్, న్యూయార్క్ లో భారత కాన్సులేటర్ రణధీర్ జైశ్వాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆగిపోయిన ఈ సంబరాలను మరింత ఉత్సాహంతో ప్రారంభించారు.
న్యూయార్క్, న్యూజెర్సీ లలోని హిందూ దేవాలయాలలో సహితం దీపావళి సంబరాలు జరుపుతున్నారు.  దేశాధ్యక్షుడు బిడెన్‌, కాంగ్రెస్‌ సభ్యుల నేతృత్వంలో వారం రోజులపాటు నిర్వహించనున్న పండుగ వేడుకలను తిలకించేందుకు పలువురు ప్రముఖ భారతీయ-అమెరికన్లు దేశం నలుమూలల నుంచి రాజధాని నగరానికి ప్రయాణమయ్యారు. 
 
తన నివాసంలో శుక్రవారం జరిగే దీపావళి వేడుకలకు హాజరు కావాలని ప్రముఖ భారతీయ-అమెరికన్లు, దౌత్యవేత్తలను, ఉన్నతాధికారులను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆహ్వానించారు. ఈ నెల 24న సోమవారం దీపావళిని జరుపుకోవడానికి వైట్‌హౌ్‌సలోని భారతీయ-అమెరికన్లను అధ్యక్షుడు బిడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ బిడెన్‌ ఆహ్వానించారు. 
 
 ఫ్లోరిడాలోని తన నివాసంలో రిపబ్లికన్‌ హిందూ కూటమికి చెందిన సుమారు 200 మంది ఇండియన్‌- అమెరికన్ల సమక్షంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దీపావళి పండుగను జరుపుకోనున్నారు. శుక్రవారం రాత్రి జరగనున్న ఈ వేడుకల్లో బాలీవుడ్‌ నృత్యాలతో పాటు అతిథులకు భారతీయ వంటకాలు వడ్డించనున్నారు. 
 
అలాగే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల రాజధానులు, గవర్నర్‌ హౌస్‌ల్లో సైతం దీపావళి పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది నుండి దీపావళి రోజును సెలవు దినంగా న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. ఈ అంశం దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నదని చెబుతూ తద్వారా పాఠశాల విద్యార్థులకు ఈ దీపాల పండుగ గురించి తెలుసుకొనే అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు.