45 రోజులకే బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా

బ్రిటన్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అనూహ్యంగా లిజ్‌ ట్రస్‌ ప్రధాని పదవి నుంచి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం 45 రోజుల పాటు మాత్రమే లిజ్‌ ట్రస్‌ ప్రధాని పదవిలో కొనసాగారు. గురువారం సాయంత్రం ఆమె ఆ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 

‘‘నేను దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి ఉన్నట్లు కనిపించలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నాను’’ అని లిజ్ ట్రస్ ప్రకటించారు. సెప్టెంబర్‌ 6న బ్రిటన్‌ పీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

బ్రిటన్‌ చరిత్రలో అత్యంత తక్కువ కాలం పని చేసిన ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ నిలిచారు. ఇంతకు ముందు జార్జ్‌ కానింగ్‌ 1827లో 119 రోజుల పాటు ప్రధానిగా పని చేశారు. జార్జ్‌ కానింగ్‌ క్షయతో బాధపడుతూ మృతి చెందారు. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయడంతో లిజ్‌ ట్రస్‌ ప్రధానిగా ఎన్నికైన విషయం తెలిసిందే. 

బ్రిటన్‌ ప్రధాని రాజీనామాకు ముందు ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్‌, హోం మంత్రి సుయెల్ల బ్రవర్‌ మాన్‌ సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. ట్రస్‌ రాజీనామా చేసినా కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు పదవిలో కొనసాగనున్నారు. అనేక సవాళ్ల మధ్య బ్రిటన్‌ ప్రధానిగా ట్రస్‌ బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె సారథ్యంలోని ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగా లిజ్ ట్రస్ తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాలపై తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఆర్థికపరమైన నిర్ణయాలు ఆమోదానికి నోచుకోలేకపోయాయి. ఆమె తీసుకువచ్చిన పన్ను తగ్గింపు విధానాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మార్కెట్లు పడిపోయాయి.

ఫలితంగా కన్జర్వేటివ్‌ పార్టీలో చీలికలకు కారణమైంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతానని ప్రకటించినా ఆచరణలో సాధ్యం కాలేదు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. సంధి హామీలను అమలు చేసేందుకు ప్రయత్నించిన ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఆర్థిక మంత్రి నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తడంతో పాటు ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పింది. కొత్త ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ క్వార్టెంగ్ నిర్ణయాలన్నింటినీ తోసిపుచ్చారు. అయినా ట్రస్ ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గకపోగా, సొంత పార్టీ ఎంపీలు ఎదురుతిరిగారు. ఆర్థిక మంత్రి ప్రకటన అనంతరం మార్కెట్‌లో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

తనఖా రేట్లు బాగా పెరిగాయి. కరెన్సీ మరింత బలహీనపడడం మొదలైంది. బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, డెట్ మార్కెట్‌లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మినీ బడ్జెట్ ప్రకటనకు ముందే, క్వార్టెంగ్ తన శాఖలోని ముఖ్యమైన అధికారులను తొలగించారు. దేశ విదేశాల్లో విమర్శల మధ్య ట్రస్ కన్జర్వేటివ్ పార్టీలో కూడా నిరసనలు మొదలయ్యాయి. ఏకంగా ప్రధానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

లిజ్‌ ట్రస్‌పై ఈ నెల 24లోగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పాలక కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన 100 మంది పార్లమెంటు సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలొచ్చాయి.  ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన లిజ్‌ ట్రస్‌  ‘‘ నేను తప్పిదాలు చేశాను. అందుకు క్షమించండి’’ అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ విధంగా క్షమాపణలు కోరిన రెండు రోజుల్లోనే ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడం గమనార్హం. 

అయితే, తాను ఎక్కడికి వెళ్లిపోనని, వచ్చే సాధారణ ఎన్నికలకు కన్జర్వేటివ్‌ పార్టీకి నేతృత్వం వహిస్తానని ఆమె ప్రకటించారు. బీబీసీతో ఆమె మాట్లాడుతూ.. ‘‘మేం తప్పులు చేశామని గుర్తించాను. వాటిని సరిదిద్దుకున్నాను. కొత్త చాన్స్‌లర్‌ను నియమించాను. ఆర్థిక స్థిరత్వాన్ని, క్రమశిక్షణను తిరిగి పెంపొందించాను. ప్రజా సంక్షేమం కోసం మెరుగైన విధానాల్లో ముందుకు వెళ్తాం.’’ అని చెప్పారు.