ఇరాన్ హిజాబ్ వివాదమై పోలీసుల దాడిలో 16 ఏళ్ల బాలిక మృతి

ఇరాన్‌లో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్‌సా అమిన్ అనే యువతి పోలీస్ కస్టడీలో కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో బాలిక పోలీసుల చేతిలో బలైపోయిన. సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీని కీర్తించే గీతం పాడనందుకు 16 ఏళ్ల బాలికను ఆ దేశ భద్రతా సిబ్బంది కొట్టి చంపారు.
వాయువ్య అర్దబిల్ నగరంలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 13న అద్దాబిల్ లోని షహేద్ గర్ల్‌హైస్కూల్‌లో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా  ఆ దేశ సుప్రీం నేతను కీర్తించే గీతాన్ని పాడాలని బాలికలను బలవంతం చేశారు. అస్రా పనాహి అనే 16 ఏళ్ల బాలిక నిరాకరించగా క్లాస్‌రూమ్‌లో అందరి ఎదుట ఆమెను దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన ఆ బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది.

అయితే భద్రతా దళాలు కొట్టడం వల్లే బాలిక మృతి చెందిందన్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఈ క్రమంలోనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బు తోనే ఆ బాలిక మృతి చెందిందని ఆ బాలిక బంధువు ఒకరు తెల్పడం గమనార్హం. అయితే ఆ బాలిక తల్లి వారి వాదనలను ఖండిస్తున్నారు. తన కుమార్తె మృతికి కారణం ఏమిటో అధికారులు అధికారికంగా తెలపడం లేదని ఆమె వాపోయారు.

ఆ బాలిక మృతి చెందిన 10 రోజుల తర్వాత, ఓ మారుమూల  గ్రామంలో ఆమె మృతదేహాన్ని కుటుంభం సభ్యుల ప్రమేయం లేకుండానే అధికారులు ఖననం చేశారు. గత శుక్రవారం పనాహి మృతి చెందిన క్రమంలో టీచర్స్ యూనియన్, సెక్యూరిటీ బలగాల అమానవీయ, క్రూరమైన దాడులను ఖండించింది. ఇరాన్ విద్యాశాఖ మంత్రి యూసఫ్ నౌరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. 

పోలీసుల దాడిలో ఏడుగురు గాయపడినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బలగాల దాడిలో 23 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్టు మానవ హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.