10 లక్షల మంది సిబ్బందిని నియమించే రోజ్ గార్ మేళా రేపే 

పది లక్షల మంది సిబ్బందిని నియమించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం అయినటువంటి ‘‘రోజ్ గార్ మేళా’’ను ప్రధాన మంత్రి అక్టోబరు 22 ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా చేర్చుకొనే 75,000 మంది కి పైగా వ్యక్తులకు నియామక లేఖలను అందజేస్తారు. ఈ సందర్భంలో నియామకం జరిగిన ఈ వ్యక్తులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

 యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటుగా పౌరుల సంక్షేమానికి పూచీ పడాలి అనే విషయంలో ప్రధాన మంత్రి నిరంతర నిబద్ధతను నెరవేర్చే దిశలో ఇది ఒక మహత్తరమయిన ముందడుగు కానున్నది. ప్రధాన మంత్రి ఆదేశాలకు అనుగుణంగా, మంజూరైన ఉద్యోగాలకు ప్రతిగా ఇప్పటికే ఉన్న ఖాళీలను ఉద్యమం తరహాలో నింపే దిశలో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు శ్రమిస్తున్నాయి.

దేశం నలుమూలల నుండి ఎంపికైన నూతన నియమితులు భారత ప్రభుత్వంలో 38 మంత్రిత్వ శాఖలలో/విభాగాలలో చేరనున్నారు. వీరు ప్రభుత్వంలో వివిధ స్థాయిలలో చేరుతారు. ఆ స్థాయిలు ఏవేవి అంటే అవి గ్రూప్-ఎ, గ్రూప్-బి (గజిటెడ్), గ్రూప్ -బి (నాన్-గజిటెడ్), గ్రూప్-సి అనేవే. నియామకాలు జరుపుతున్న ఉద్యోగాలలో కేంద్ర సాయుధ దళ సిబ్బంది, సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్, ఎల్ డిసి, స్టెనో, పిఎ, ఇన్ కమ్ టాక్స్ ఇన్ స్పెక్టర్ లు, ఎంటిఎస్, తదితరాలు భాగంగా ఉన్నాయి.

 ఈ నియామకాలను మంత్రిత్వ శాఖలు, విభాగాలు అయితే తమంతట తాము గాని, లేదా యుపిఎస్ సి, ఎస్ఎస్ సి , రైల్ వే రిక్రూట్ మెంట్ బోర్డు వంటి నియామక సంస్థల ద్వారా గాని మిశన్ మోడ్ లో చేపట్టడం జరుగుతున్నది. త్వరిత గతిన భర్తీకై ఎంపిక ప్రక్రియలను సులభతరం చేయడంతో పాటుగా ఈ ప్రక్రియలో సాంకేతిక విజ్ఞాన సహాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది.