కలవరపెడుతున్న కొత్త వేరియంట్

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు రెండు వేల సమీపంలోనే నమోదవుతున్నాయి. మరో వైపు ప్రజలంతా కూడా పండగల ఉత్సాహంలో ఉన్నారు. అయితే ఇదే సమయంలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘ఎక్స్‌బిబి’ వైద్య వర్గాలను అందోళనకు గురి చేస్తోంది.
 
మహారాష్ట్రలో గత వారంతో పోలిస్తే కొత్త కేసులు 17.7 శాతం పెరిగాయి. అందుకు ఈ ఎక్స్‌బిబి సబ్ వేరియంట్‌ను కారణంగా చూపిస్తున్నారు. చలికాలం, పండగల సీజన్ ఉండడంతో ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బిఎ 2.75, బిజె.1 రకాలు కలిసి ఈ ఎక్స్‌బిబి సబ్ వేరియంట్ ఏర్పడినట్లు వైద్యనిపుణులు వెల్లడించారు.
 
మహారాష్ట్రతో పాటుగా దీనిని ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడులలో గుర్తించారు. ఈ ఆగస్టులోనే సింగపూర్, అమెరికాలో ఇది వెలుగులోకి వచ్చింది. దీనికి బిఎ 2.75 కన్నా ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందే లక్షణం, రోగ నిరోధక శక్తిని ఏమార్చే గుణం ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఎక్స్‌బిబితో పాటుగా మొదటిసారిగా మహారాష్ట్రలో బిఎ.2.3.20,బిక్యు.1 రకాలను కూడా గుర్తించారు.
 
ఇక ప్రస్తుతం కేసుల పెరుగుదల ఆ రాష్ట్రంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఠాణె, రాయ్‌గడ్, ముంబయిలో కనిపించింది. ఈ నేపథ్యంలో రాబోయే రెండువారాలు అప్రమత్తంగా ఉండాలని, ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిప్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర వైద్య శాఖ ఓ బులెటిన్‌లో ప్రజలను హెచ్చరించింది. అంతేకాకుండా ప్రజలను కలుసుకునే విషయంలో కూడా గతంలో కొవిడ్ సమయంలో తీసుకున్న తరహా జాగ్రత్తలు పాటించాలని ఆ బులెటిన్ సూచించింది.
అమెరికా ల్యాబ్ లో కొత్త వేరియంట్
 
ఇలా ఉండగా, కొత్త తరహా కరోనా  వైరస్‌ వేరియెంట్‌ను అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఒమైక్రాన్‌ వేరియెంట్‌ నుంచి దాని స్పైక్‌ ప్రొటీన్‌ను వేసి వుహాన్‌లో తొలుత వెలుగుచూసిన వైర్‌సపై ప్రయోగించడం ద్వారా హైబ్రిడ్‌ వైర్‌సను సృష్టించినట్లు వారు తెలిపారు.  చిట్టెలుకలపై ఈ వైర్‌సను ప్రయోగించగా 80 శాతం ప్రభావశీలతను చూపించిందని పేర్కొన్నారు. వారి అధ్యయన వివరాలను డెయిలీమెయిల్‌.కామ్‌ వెబ్‌సైట్‌ ప్రచురించింది.
కాగా.. ఈ పరిశోధనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోస్టన్‌ వర్సిటీ పరిశోధకులు నిప్పుతో చెలగాటమాడుతున్నారని నిపుణులు మండిపడ్డారు. అనుభవజ్ఞుల సూచనలు లేకుండా, ముంచుకొచ్చే ప్రమాదంపై ముందస్తు అంచనా లేకుండా ఇలాంటి పరిశోధనలు చేయడం శ్రేయస్కరం కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.  అయితే వర్సిటీ ప్రతినిధులు అమెరికాలోనే అత్యంత భద్రత కలిగిన 4 ల్యాబ్స్‌లో తమదీ ఒకటని, వైరస్‌ బయటికి వచ్చే అవకాశమే లేదని  పేర్కొన్నారు.