భారత్‌లో త్వరలో ఏకే-203 రైఫిల్స్‌ తయారీ షురూ

భారత్‌లో ఏకే-203 అసాల్ట్‌ రైఫిల్స్‌ ఉత్పత్తి ఈ ఏడాది చివరి నాటికి యూపీలో ప్రారంభమవుతుందని రష్యన్‌ ఆయుధ ఎగుమతిదారు రోసోబొరోన్‌ ఎక్స్పోర్ట్‌ వెల్లడించింది. ఈ ఏడాది నుంచి అసాల్ట్‌ రైఫిల్స్‌ నిరంతరాయంగా ఉత్పత్తి చేసేందుకు భారత్‌లో ప్లాంట్‌ సంసిద్ధంగా ఉందని రోసోబొరోన్‌ ఎక్స్పోర్ట్‌ అధిపతి అలెగ్జాండర్‌ మిఖీవ్‌ పేర్కొన్నారు.
 
అక్టోబర్‌ 18 నుంచి గుజరాత్‌లో జరిగే డిఫెన్స్‌ ఎక్స్‌పో నేపధ్యంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. అమేధి జిల్లాలోని కొర్వా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో రష్యాకు చెందిన కలష్నికోవ్‌ రైఫిల్స్‌ తయారుచేసేందుకు 2019లో ఇండో-రష్యా రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. కొర్వాలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ కలష్నికోవ్‌ ఏకే-203 రైఫిల్స్‌ తయారీకి సిద్ధమవుతుందని అలెగ్జాండర్‌ మిఖీవ్‌ తెలిపారు.రష్యాకు చెందిన ప్రభుత్వ రంగ రొసోబొరోన్‌ఎక్స్సోర్ట్‌ దేశ, విదేశాల్లోని కీలక సైనిక ప్రాజెక్టులను పర్యవేక్షిస్తుంది. భారత్‌లో రష్యన్‌ అసాల్ట్‌ రైఫిల్స్‌ను నూరుశాతం దేశీయంగా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని మిఖీవ్‌ పేర్కొన్నారు.

భవిష్యత్‌లో తమ జాయింట్‌ వెంచర్‌ ఉత్పత్తిని పెంచడంతో పాటు కలష్నికోవ్‌ అసాల్‌ రైఫిల్‌ ప్లాట్‌ఫాంపై అడ్వాన్స్డ్‌ రైఫిల్స్‌ను తయారు చేసే విధంగా వ్యూహాలకు పదును పెడుతున్నామని చెప్పారు.