గ్యాస్‌ సబ్సిడీ మాదిరిగా యూరియా సబ్సిడీ

 
గ్యాస్‌ సబ్సిడీ మాదిరిగా యూరియా సబ్సిడీ రైతుల ఎక్కౌంటులో వేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రి జి కిషన్‌ రెడ్డి తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే రైతు సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు.
 
పిఎం కిసాన్‌ 12వ విడత నిధులు విడుదల వర్చువల్‌, ప్రధాన మంత్రి కిసాన్‌ సమృద్ధి 600 కేంద్రాలు, వన్‌ నేషన్‌ వన్‌ ఫెర్టిలైజర్‌ను ప్రధాని వర్చువల్‌ ప్రారంభోత్సవాల కార్యక్రమంలో ఏలూరు నుంచి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఆకలి సమస్య తీరాలన్నా రైతు సంతోషంగా ఉండాలని చెప్పారు.
 
కరోనా సమయంలో అందరూ ఇళ్లలో ఉంటే రైతులు పంట పండించి దేశ ప్రజలకు ఆహారం అందించారని కేంద్ర మంత్రి కొనియాడారు. రైతులేనిదే రాజ్యం లేదంటూ అందరికన్నా మిన్న అన్నదాత అని ఆయన ప్రశంసించారు. కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, ఆర్‌డిఒ కె పెంచల కిషోర్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వై.రామకృష్ణ తదితరులుఈ కార్యక్రమాన్ని వీక్షించారు.