ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన విధ్వంసంపై నమోదైన కేసుల్లో పోలీసు శాఖ బలమైన ఐపీసీ సెక్షన్లు చేర్చింది. దాడులకు పాల్పడిన నిందితులపై హత్యాయత్నం(ఐపీసీ 307), కుట్ర కోణం(120బీ)తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా చేర్చారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులు ఆయా జిల్లాల్లోని కోర్టుల్లో మంగళవారం మెమో దాఖలు చేశారు.
ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్లు ఓపెన్ చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ముగ్గురిపై పీడీ యాక్ట్, మరో ఇద్దరిని బహిష్కరణకు సిఫార్సు చేశామని తెలిపారు. ఎన్నికల ముందు రోజు నమోదైన కేసుల్లో 1,522 మందిని, ఎన్నికల రోజు నమోదైన కేసుల్లో 2,790 మందిని, ఎన్నికల అనంతరం నమోదైన కేసుల్లో 356 మందిని గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. 41ఎ సిఆర్‌సి కింద కొందరిని అరెస్టు చేశామని, మరికొందరికి నోటీసులు అందజేశామని చెప్పారు.
వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధుల సిఫారసుతో పోస్టింగ్‌లు తెచ్చుకున్న పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్షేత్రస్థాయిలో పర్యటించి దాడుల తీవ్రతను, అక్కడ లభ్యమైన ఆధారాలను పరిశీలించిన తర్వాత హత్యాయత్నం సెక్షన్ల నమోదుకు సిఫారసు చేసింది. ఈ జిల్లాల్లో నమోదైన దాదాపు అన్ని హింసాత్మక ఘటనల్లోనూ కుట్రకోణాన్ని గుర్తించి 120బీ చేర్చిన సిట్ అధికారులు పల్నాడు జిల్లాలో ఈవీఎంల ధ్వంసంపై ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా చేర్చారు.
ఈ జిల్లాలో ఈవీఎంలు ధ్వంసం చేసినవారిపై మంగళవారం మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ ఎన్నికల హింసకు సంబంధించి మూడు జిల్లాల్లో నమోదైన కేసుల సంఖ్య 35కు చేరింది. నిందితుల సంఖ్య 1,370 నుంచి 1,435కు చేరగా అరెస్టులు మాత్రం 300 దాటలేదు. పోలింగ్ ముగిసిన వెంటనే తమ అనుచరులు రాష్ట్రం వదిలి వెళ్లిపోయేందుకు అభ్యర్థులు అన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తించిన సిట్ వారు ఎక్కడెక్కడ ఉన్నారో సమాచారం సేకరించి అక్కడికి పోలీసు బృందాలను పంపింది.
సుమారు 30మందికి పైగా హిస్టరీ షీట్స్ తెరవదగిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరికొందరి ఆచూకీ లభించిందని, అరెస్టులు కొనసాగిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుల విషయమై మంగళవారం సాయంత్రం సిట్ ఐజీ వినీత్ బ్రిజిలాల్, గుంటూరు ఐజీ ఎస్‌ఎస్ త్రిపాఠీ, అనంతపురం రేంజ్ డీఐజీ షేముషి బాజ్‌పాయ్, పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీలతో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వీడియో కాన్ఫరెస్ట్ నిర్వహించారు. ఎవ్వరినీ వదిలి పెట్టొద్దని, కఠినంగా వ్యవహరించాలని బాధ్యులను జైల్లో వేసేవరకూ సిట్ బృందాలు అక్కడే ఉండి స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ ఆదేశించారు.
More Stories
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
జగన్ ప్యాలస్ లపై ఆరా తీసిన అమిత్ షా
పవన్ కళ్యాణ్ కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్