వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ … సుప్రీం సుముఖత

మాజీ  మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. తమకు ఏపీలో నిర్వహిస్తున్న విచారణపై నమ్మకం లేదని, దర్యాప్తు సంస్థ అధికారులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని, కాబట్టి ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేక కుమార్తె డా. సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
 
దానితో ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు  అంగీకారం తెలిపింది. ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుకుంటున్నారని ప్రతివాదులైన ఉమాశంకర్ రెడ్డి, గంగిరెడ్డి\ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బదిలీ చేయవద్దని సీబీఐ కోరింది. కర్నాటకకు బదిలీ చేయాలని కోర్టును సీబీఐ అభ్యర్థించింది.
 
అయితే తన తండ్రి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరిన సునీతా రెడ్డి  తరుఫు న్యాయవాదులు మాత్రం.. తెలంగాణకు బదిలీ చేసినా తమకు ఫర్వాలేదని తెలిపారు. విచారణ జాప్యం విషయంలో సీబీఐపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సునీతారెడ్డి పిటిషన్‌లో చేసిన వాదనలను న్యాయస్థానం అంగీకరించింది.
 
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలే అని నిన్న సీబీఐ వెల్లడించింది. ఈ మేరకు సీబీఐ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ తరపున సునీతారెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. సునీతా రెడ్డి పిటిషన్‌లో చెప్పినవన్నీ నిజాలేనని సీబీఐ స్పష్టం చేసింది. విచారణాధికారిపైనే నిందితులు కేసులు పెట్టారని సీబీఐ పేర్కొంది.
 
 మేజిస్ట్రేట్ ముందు 164 స్టేట్‌మెంట్ ఇస్తానన్న పోలీసు అధికారి శంకరయ్యకు ఏపీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చిందని సీబీఐ తెలిపింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత తనపై సీబీఐ ఒత్తిడి తెచ్చి 164 స్టేట్‌మెంట్ అడిగారంటూ శంకరయ్య లేఖ రాశారని సీబీఐ స్పష్టం చేసింది. ఏపీ పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని, అందుకే విచారణ జాప్యం అవుతోందని సీబీఐ వెల్లడించింది. సునీతారెడ్డి వాదనలన్నింటికీ సీబీఐ మద్దతు తెలిపింది.