బీసీసీఐ కొత్త అధ్యక్షుడుగా రోజర్ బిన్నీ

భారత మాజీ క్రికెటర్,  1983 ప్రపంచకప్ విజేత-జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ మంగళవారం 36వ బిసిసిఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సౌరవ్ గంగూలీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రోజర్‌ బిన్నీ వయసు 67 ఏళ్లు. బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం బిన్నీ మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. ముంబైలోని తాజ్ హోటల్‌లో బీసీసీఐ వార్షిక సర్వసభ్యసమావేశం జరిగింది. బోర్డుకు అనుబంధంగా ఉన్న 30కి పైగా క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా 2019 నుంచి 2022 సెప్టెంబర్ వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించిన సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కార్యవర్గం పదవీకాలం ముగియటంతో.. సరికొత్త కార్యవర్గాన్ని క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఎన్నికున్నారు. ఇప్పటి వరకూ బోర్డు కోశాధికారిగా వ్యవహరించిన అరుణ్ ధుమాల్ ..ఐపీఎల్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించనున్నారు.
ముంబై క్రికెట్ సంఘం ప్రతినిధి అశీష్ షెలార్ బీసీసీఐ సరికొత్త కోశాధికారి అయ్యారు. బోర్డు ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శిగా దేవజిత్ సైకియా ఎంపికయ్యారు. బీసీసీఐ సెక్రటరీగా జైషా కొనసాగనున్నారు.

బిన్నీ ఇప్పటి వరకు కర్నాటక క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా చేశారు. ఇప్పుడు ఆ పదవిని ఆయన వదిలేయనున్నారు. మీడియం పేసర్‌ అయిన బిన్నీకపిల్‌ బృందంలో ఆల్‌రౌండర్‌ పాత్రను పోషించారు. ఆయన 1983 ప్రపంచ కప్‌లో భారత చారిత్రక విజయానికి మీడియం పేసర్‌గా తోడ్పడ్డారు. ఆ టోర్నీలో అతను 18 వికెట్లు తీసుకున్నాడు.

ఆ ప్రతిష్టాత్మక టోర్నమెంటు ఎడిషన్‌లో అదే అత్యధికం. బిన్నీ సెలక్షన్ కమిటీలో సీనియర్ సభ్యుడిగా కూడా పనిచేశారు. అప్పట్లో సందీప్ పాటిల్ చైర్మన్‌గా ఉండేవారు. ఆయన కుమారుడు స్టూవర్ట్ బిన్నీ పేరు సెలక్షన్ చర్చకు వచ్చినప్పుడు ఆయన ఆ ప్రొసీడింగ్స్ నుంచి తప్పించుకునేవారు.
 
పాక్ లో జరిగే ఆసియా కప్ లో భారత్ పాల్గొనదు
 
వచ్చే ఏడాది ఆసియా కప్‌ పాకిస్తాన్‌లో జరుగనున్నది. అయితే, భారత్‌ మాత్రం పాక్‌కు వెళ్లదని ఆసియా క్రికెట్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జైషా మంగళవారం తెలిపారు. 2023 ఆసియా కప్ తటస్థ వేదికల్లో జరుగుతుందని స్పష్టత ఇచ్చారు. జైషా మాట్లాడుతూ పాక్‌కు వెళ్లేది లేనిది ప్రభుత్వం నిర్ణయిస్తుందని, కాబట్టి దానిపై తాము వ్యాఖ్యానించలేమని స్పష్టం చేశారు.
 
వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌ టోర్నమెంట్‌ను తటస్థ వేదికల్లో నిర్ణయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే, టీమిండియాను పాక్‌కు పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు గతంలో వార్తలు రాగా, బీసీసీఐ కార్యదర్శి అయిన జైషా ఈ వార్తలను ఖండించారు. వచ్చే ఏడాది ఆసియాకప్‌ను పాక్‌లో నిర్వహించాలని మొదట నిర్ణయించారు. 2023లో జరిగే ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరుగనున్నది.
 
భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య గత తొమ్మిదేళ్లుగా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పాల్గొనడం లేదు. ఇరుదేశాల మధ్య చివరి టీ20, వన్డే సిరీస్ 2012 డిసెంబర్‌లో జరిగింది. టీ20 సిరీస్ 1-1తో సమం కాగా, వన్డే సిరీస్‌ను పాక్‌ 2-1తో కైవసం చేసుకున్నది. 2007-08 సీజన్ నుంచి టెస్ట్ సిరీస్‌లో పోటీపడింది లేదు.
 
2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత జట్టు పాక్‌లో పర్యటించలేదు. అదే సమయంలో నియంత్రణ రేఖ వెంట నిరంతర కాల్పుల విరమణ ఉల్లంఘనలు, 2019లో పుల్వామా దాడి తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరుజట్లు పోటీపడింది లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్‌లో మాత్రమే ఇరుజట్లు తలపడ్డాయి.