జోడో యాత్ర ఆపండి రాహుల్… ఎన్నికలు చూడండి!

గత 40 రోజులుగా భారత్ జోడో యాత్రలో ఉంటూ పార్టీ వ్యవహారాలను పట్టించుకోకుండా గడుపుతున్న రాహుల్ గాంధీ వెంటనే యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ ఎంపీ, గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రాన్సిస్కో సర్దిన్హా హితవు చెప్పారు. వెంటనే త్వరలో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో పర్యటించాలని ఆయనకు సూచించారు.

ఎన్నికల సంగతి పట్టించుకోకుండా ఈ యాత్ర ఏమిటనే విధంగా ఆయన ఓ విధమైన అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ పార్టీ వ్యవహారాలు పట్టించుకోరు, మిగిలిన వారెవ్వరిని పట్టించుకోనివ్వరనే అసంతృప్తి కొంతకాలంగా కాంగ్రెస్ లో పేరుకు పోతున్నది.

ప్రస్తుతం పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగినా, కొత్త అధ్యక్షుడు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉండబోదని గత నెలరోజులుగా పార్టీలో ఈ సందర్భంగా జరుగుతున్న వ్యవహారాలు స్పష్టం చేస్తున్నాయి.  హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది.

ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం వెనుకబడింది. అందుకే గోవా మాజీ సీఎం ప్రాన్సిస్కో సర్దిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర ఆపి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని సలహా ఇచ్చారు.

ఇప్పటికే 40 రోజుల పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో యాత్రను సుమారు 1,000 మేరకు రాహుల్ పూర్తి చేశారు. మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశిస్తున్నారు.