అంధేరి ఈస్ట్‌ ఉప ఎన్నికలో పోటీ నుండి తప్పుకున్న బిజెపి

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ఈస్ట్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ముర్జీ పటేల్ పోటీ నుంచి తప్పుకున్నారు. నామినేషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నట్లు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే తెలిపారు.
మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ కుటుంబానికి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలుపకూడదన్న మహారాష్ట్ర రాజకీయ సంప్రదాయానికి అనుగుణంగా తమ అభ్యర్థిని పోటీ నుంచి ఉపసంహరించినట్లు మీడియాతో  ఆయన చెప్పారు. దానితో, శివసేన (ఉద్ధవ్ థాకరే) అభ్యర్థిగా పోటీ చేస్తున్న రితుజా లట్కే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది.
శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన అంధేరీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్‌ లట్కే కొన్ని నెలల కిందట మరణించారు. దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య రితుజా లట్కేను ఉద్ధవ్‌ వర్గం పోటీకి నిలిపింది. బీఎంసీ ఉద్యోగిని అయిన రితుజా రాజీనామాను నామినేషన్‌కు చివరి వరకు పెండింగ్‌లో ఉంచడంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించి ఆమోదం పొందేటట్లు చేసుకున్నారు.
 కాగా,రుతుజా లట్కేపై బీజేపీ ఎవరినీ పోటీకి దింపొద్దని కోరుతూ  మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన అధ్యక్షుడు రాజ్‌థాకరే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆదివారం లేఖ రాశారు. తన భర్త సిట్టింగ్‌ స్థానమైన అంధేరీ ఈస్ట్‌ను ఆమెకే వదిలేస్తే బాగుంటుందని ఆయన సూచించారు.
గత జూన్‌లో ఏక్‌నాథ్‌ షిండే ఉద్దవ్‌ థాకరేపై తిరుగుబాటు చేసి, శివసేనకు చెందిన  40 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం మొదటిసారిగా ఈ ఉపఎన్నిక రావడంతో ఆసక్తి నెలకొంది.  పైగా త్వరలో బృహత్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నందున ఇవి బలపరిక్షగా మారనున్నాయి. అయితే బిజెపి అభ్యర్థి వైదొలగడంతో ఎన్నిక తప్పనున్నది.