తైవాన్‌ ఎప్పటికైనా చైనాలో కలవాల్సిందే

తైవాన్‌ను చైనాలో అంతర్భాగం చేసేందుకు అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. శాంతియుత మార్గంలోనే పునరేకీకరణ జరుగాలని కోరుకొంటున్నామని, అదే సమయంలో బలప్రయోగం ఉండదని హామీ ఇవ్వబోనని తేల్చి చెప్పారు. 
 
చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) 20 నేషనల్‌ కాంగ్రెస్‌లో జిన్‌పింగ్‌ ఆదివారం ప్రారంభోపన్యాసం చేస్తూ  తైవాన్‌ ఎప్పటికైనా చైనాలో కలువాల్సిందేనని జీ జిన్‌పింగ్‌ తేల్చి చెప్పారు. ‘శాంతియుతంగానే పునరేకీకరణ (చైనాలో తైవాన్‌ను అంతర్భాగం చేయటం) సాధించేందుకు మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. కానీ, ఇందుకోసం బలప్రయోగానికి దిగబోమని మాత్రం హామీ ఇవ్వలేను’ అని వెల్లడించారు.
తైవాన్ విషయంలో అమెరికా తీరుపై మండిపడుతూ స్వతంత్ర దేశంగా మనుగడ సాగేందుకు అనుమతిపబోమని స్పష్టం చేశారు. స్వపరిపాలన కావాలంటున్న తైవాన్‌లో వేర్పాటు వాదం, విదేశీ శక్తుల జోక్యంపై  చైనా పోరాటం చేస్తోందని హెచ్చరించారు. హాంకాంగ్‌పై ఇప్పటికే ఆధిపత్యం సాధించామని ప్రకటిస్తూ దీని ద్వారా అల్లర్ల నుంచి సుపరిపాలన దిశగా హాంకాంగ్‌ మార్పు చెందుతోందని చెప్పారు.

ప్రపంచంపై ఆధిపత్య పోరాటానికి సిద్ధమని జిన్‌పింగ్‌ పరోక్షంగా సంకేతాలిచ్చారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం, తైవాన్‌కు అమెరికా మద్దతు నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. 

చైనా రాజ్యాంగం, హాంగ్ కాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ బేసిక్ చట్టాలకు అనుగుణంగా హాంగ్ కాంగ్‌పై కేంద్ర ప్రభుత్వం అధికారాలను వినియోగించిందని తెలిపారు. హాంగ్ కాంగ్‌లో ప్రశాంతత వచ్చిన తర్వాత దేశభక్తులు పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. సైన్యాన్ని ఆధునీకరించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. 

చైనా జనాభాలో తలెత్తనున్న క్షీణతతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందన్న ఆందోళనలపై స్పందిస్తూ  జననాల రేటును పెంచడానికి, జనాభా వృద్దాప్యానికి ప్రతిస్పందనగా చురుకైన జాతీయ వ్యూహాన్ని అనుసరించడానికి ఒక విధాన వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. అవినీతిపై అణచివేతతో దేశ అధికార పార్టీ, సైన్యంలోని తీవ్రమైన అనూహ్య ప్రమాదాలను తొలగించగలిగామని తెలిపారు.

వారం రోజుల పాటు సాగనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలు ఆదివారం బీజింగ్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడోసారి జీ జిన్ పింగ్ ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మావో జెడాంగ్ తర్వాత తిరిగి అంతటి శక్తివంతమైన నేతగా జిన్ పింగ్ ను ప్రతిష్టించడమే చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభలు కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను మూడోసారి సిపిసి ఎన్నుకుంది. జిన్‌పింగ్ మినహా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్‌తో పాటు సీనియర్ నాయకులందరూ తమ పదవులకు రాజీనామాలు చేస్తారు. ఆ స్థానాల్లో కొత్తవారు రానున్నారు. ఈ సమావేశంలో సుమారు 2,300 మంది డెలిగేట్లు పాల్గొన్నారు. 

ఇదిలావుండగా చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆయనే జీవితాంతం ఆ పదవిలో ఉండే అవకాశం కనబడుతోంది. మరోవంక, మహాసభలో జరుగుతున్న నేపథ్యంలో చైనాలో ఆందోళనలు కలకలం రేపుతున్నాయి. 

జీరో కోవిడ్ విధానాన్ని ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజింగ్ లోని విశ్వవిద్యాలయాల్లో బ్యానర్లు ప్రదర్శించారు. జీరో కోవిడ్ వద్ద.. కావాల్సింది సంస్కరణలు..మేము పౌరులం, బానిసలం కాదు అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. దీంతో పోలీసులు బీజింగ్ లో భద్రత కట్టుదిట్టం చేశారు.