హరిద్వార్‌ రైల్వేస్టేషన్‌తో చార్‌ధామ్‌కు జైషే బాంబు బెదిరింపులు

హరిద్వార్‌లోని రైల్వేస్టేషన్లతో పాటు ఆధ్యాత్మిక ప్రదేశాలకు బాంబు బెదిరింపు లేఖలు రావడంతో కలకలం సృష్టిస్తున్నది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ఏరియా కమాండర్‌ పేరిట శనివారం హరిద్వార్‌ రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. ఈ క్రమంలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. స్టేషన్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ నెల 10న హరిద్వార్‌ రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ పేరుతో సాధారణ పోస్టు ద్వారా కార్యాలయానికి లేఖ వచ్చింది. స్టేషన్‌ సూపరింటెండెంట్‌ లేఖను తెరిచి చూడగా ఆయన షాక్‌కు గురయ్యారు. హరిద్వార్‌ రైల్వేస్టేషన్‌తో పాటు డెహ్రాడూన్‌, లక్సర్‌, రూర్కీ, కత్‌గోడం, నజీబాబాద్‌, షాహ్‌గంజ్‌ సహా పలు స్టేషన్లకు లేఖలో బాంబు బెదిరింపులు వచ్చాయి. 

లేఖ పంపిన వ్యక్తి తనను తాను జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ ఏరియా కమాండర్‌గా పేర్కొన్నాడు. హిందీలో రాసిన లేఖలో అక్టోబర్‌ 25న స్టేషన్లను పేల్చివేస్తామని లేఖలో పేర్కొన్నారు. అలాగే 27న ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌తో పాటు ఇతర మతపరమైన ప్రదేశాలపై బాంబు పేలుళ్లు జరుగుతాయని లేఖలో సదరు వ్యక్తి హెచ్చరించాడు.

బెదిరింపు లేఖ నేపథ్యంలో అజ్ఞాత వ్యక్తులపై పోలీసులు యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు జీపీఆర్‌ అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌ అరుణ భారతి తెలిపారు. కేసు నమోదు చేయడంతో పాటు ఈ అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, స్టేషన్‌లో భద్రతను పూర్తిస్థాయిలో పటిష్టం చేశామని, అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఒక్కరిపై నిఘా వేసినట్లు వివరించారు.