ఉగ్ర సంబంధాలున్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

ఉగ్రవాద సంబంధాలున్నఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను  జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించింది. ఈ ఉద్యోగులు నార్కో-సిండికేట్ నడుపుతూ, ఉగ్రదాడులు జరిపేందుకు నిర్దిష్ట ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నారనే కారణంగా వీరిని సర్వీసు నుంచి తప్పించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. 

ఉద్వాసనకు గురైన ఉద్యోగులలో జమ్మకశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ తన్వీర్ సలీమ్ డర్, బారాముల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మేనేజర్ అఫఖ్ అహ్మద్ వని, బీడీఓ ఆఫీసు ప్లాన్‌టేషన్ సూపర్‌వైజర్ ఇఫ్తిఖర్ ఆండ్రబి, జల్ శక్తి శాఖకు చెందిన ఐర్షఆద్ అహ్మద్ ఖాన్, పీహెచ్ఈ సబ్‌డివిజన్ అసిస్టెంట్ లైన్‌మన్ అబ్దుల్ మొమిన్ పీర్ ఉన్నారు.

తన్వీర్‌ కేసులో ఆయన ఉగ్రవాదుల మారణాయుధాలను రిపేర్ చేస్తూ, వారికి అవసరమైన మందుగుండు సామాగ్రికి ఏర్పాట్లు చేసేవాడని విచారణలో తేలింది. కీలకమైన టెర్రరిస్టు కమాండర్‌గా, శ్రీనగర్ సిటీలో లష్కరే-ఇ-తొయిబాకు లాజిస్టిక్ ప్రొవైడర్‌గా కూడా అతనికి పేరుంది. 2003, 2004లో శ్రీనగర్‌ సిటీలో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఆయన ప్రమేయం ఉన్నట్టు తేలింది. ఎంఎల్‌సీ జవైద్ షల్లా హత్య కేసులోనూ ఆయన కీలక పాత్ర పోషించినట్టు వెల్లడైంది.

అఫఖ్ అహ్మద్ వనీ డ్రగ్స్ స్మిగ్లింగ్స్‌తో నిధులు సమీకరించి ఉగ్రసంస్థలు దాడులకు పాల్పడేందుకు తోడ్పాటు అందించేవాడు. 2030 జూన్‌లో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్ఐఏ ఇంటరాగేషన్‌లో అఫఖ్ నుంచి నగదు, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. నార్కో టెర్రర్ నెట్‌వర్క్‌లో ఆయన కీలక పాత్రధారనే విషయం ఎన్ఐఏ విచారణలో తేలింది.

ఇఫ్తిఖర్ ఆండ్రబి 2015,16,17లో పాకిస్థాన్‌లో పర్యటించి లష్కరే తొయిబా, హెచ్ఎం వంటి ఉగ్రవాద సంస్థల కమాండర్లను కలుసుకున్నాడు. పౌరులు, భద్రతా దళాలపై దాడులు నిర్వహించేందుకు అవసరమైన నిధుల కోసం నార్కో స్మగ్లింగ్ ద్వారా డబ్బులు సేకరించే టాస్క్ చేపట్టాడు. ఉగ్రవాదుల చొరబాటుకు సహకరించేవాడు.

కాగా, ఉగ్రవాద సంస్ధథలకు ఇర్షాద్ అహ్మద్ ఖాన్ నేరుగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరాచేసేవాడని, లోయలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఆయన కీలక పాత్ర పోషించారని విచారణలో తేలింది. అబ్దుల్ మొమిన్ పీర్‌ కశ్మీర్ లోయలో నార్కో-టెర్రర్ నెట్‌వర్క్ విస్తరించే పనులు నిర్వహించేవాడు. అమృత్‌సర్‌కు హెరాయిన్ రవాణా చేస్తూ 2017లో అతను పట్టుబడ్డాడు.

కాశ్మీర్ లో మరో పండిట్ కాల్చివేత 

జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం ఓ కశ్మీరీ పండిట్‌పై విచక్షణారహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న పండిట్‌ను  షోపియాన్ ఆసుపత్రికి తరలించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. మృతుడిని పురాణ్ కృషన్‌ భట్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం తన ఇంటి ముందు ఉండగా, అతనిపై టెర్రరిస్టులు దాడి చేశారు.