జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్‌

జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్‌

జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్‌ (ఎన్నార్సీ)ను రూపొందించే దిశగా కేంద్రం చకచకా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా భారతీయుల జనన, మరణాలపై జాతీయ స్థాయి డాటాబేస్‌ రూపొందించేందుకు సిద్ధం అవుతున్నది. దీనికోసం కేంద్ర హోంశాఖ బిల్లును, క్యాబినెట్‌ నోట్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది. 

ఆ క్యాబినెట్‌ నోట్‌ ప్రకారం జనాభా రిజిస్టర్‌, ఎన్నికల రోల్స్‌, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సును ఏకీకరించనున్నది. ఈ ఏకీకరణకు వీలుగా ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయనున్నది. కాగా, ప్రస్తుతం జనన, మరణాల డాటాబేస్‌ను రాష్ర్టాల పరిధిలోని స్థానిక రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు.

మొత్తం జనన, మరణాల జాతీయ డాటాబేస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా చేతిలో ఉండనున్నది. ఆ పదవిలో ఉండే అధికారులు  రాష్ర్టాల్లోని చీఫ్‌ రిజిస్ట్రార్లతో సమన్వయం చేసుకొంటారు. ఆధార్‌, రేషన్‌ కార్డు, ఎలక్టోరల్‌ రోల్స్‌, పాస్‌పోర్ట్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తారు.

దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వలసదారులను ఏరివేసేందుకు జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్సీ)ని తీసుకొస్తామని గతంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. అందుకు తగ్గట్టే జనన, మరణాల డాటాబేస్‌ విషయంలో కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకొంటున్నదని తెలుస్తున్నది. 

ఇప్పటికే, అస్సాంలో ఎన్‌ఆర్సీని పూర్తి చేసి, 19 లక్షల మంది అక్రమ వలసదారులను కేంద్రం డిటెన్షన్‌ కేంద్రాల్లో ఉంచింది. ఇదిలా ఉండగా, త్వరలోనే ఈ ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించే అవకాశాలున్నాయని, వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో సవరణ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర అధికారులు పేర్కొన్నారు.