ఇస్లామాబాద్ వెంటనే సీమాంతర ఉగ్రవాదం నిలిపివేయాలి 

ఇస్లామాబాద్ వెంటనే సీమాంతర ఉగ్రవాదం నిలిపివేయాలి 

పాకిస్థాన్‌తో సహా పొరుగు దేశాలన్నింటితో భారత్ సాధారణ సంబంధాలను కోరుకుంటోందని స్పష్టం చేస్తూ, అయితే అందుకోసం ఇస్లామాబాద్‌ వెంటనే సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయాలని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాకాశీ లేఖి తేల్చిచెప్పారు.

కజకిస్తాన్‌లోని అస్తానాలో ఆసియాలో పరస్పర చర్య, విశ్వాసాన్ని పెంపొందించే చర్యలపై (సిఐసిఎ) 6వ శిఖరాగ్ర సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. “పాకిస్థాన్ ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా ఉంది. భారత్‌తో సహా తీవ్రవాద కార్యకలాపాలకు మూలంగా కొనసాగుతోంది” అంటూ ఆమె మండిపడ్డారు.

పాకిస్తాన్ మానవాభివృద్ధికి ఎటువంటి పెట్టుబడులు పెట్టడం లేదని,  అయితే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను సృష్టించడం, నిలబెట్టడం కోసం వారి వనరులను అందిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సహా పలువురు ప్రపంచ నేతలు హాజరైన ఈ సదస్సులో లేఖి మాట్లాడుతూ, పాకిస్థాన్‌తో సహా అన్ని పొరుగు దేశాలతో భారత్ సాధారణ సంబంధాలను కోరుకుంటోందని లేఖి చెప్పారు.

“భారత్‌కు వ్యతిరేకంగా సరిహద్దు ఉగ్రవాదానికి తన ఆధీనంలో ఉన్న ఏ భూభాగాన్ని ఏ విధంగానూ ఉపయోగించకుండా ఉండటానికి విశ్వసనీయమైన, ధృవీకరించదగిన, తిరుగులేని చర్యలతో సహా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా పాకిస్తాన్‌కు చర్చలకు సిద్ధం కావలి” అని ఆమె తేల్చి చెప్పారు.

ఈ సమావేశంలో పాక్ ప్రధాని షరీఫ్ కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన తర్వాత, ఆమె ప్రసంగిస్తూ  ఈ ముఖ్యమైన అంతర్జాతీయ ఫోరమ్ సహకార ఎజెండా నుండి దృష్టి మరల్చకుండా ఇరుదేశాలు ద్వైపాక్షికంగా చర్చించుకోవడానికి,  సమస్యలను పరిష్కరించుకోవడానికి పాకిస్థాన్ ఆ విధంగా చేయడమే వీలు కల్పిస్తుందని మీనాక్షి లేఖి స్పష్టం చేశారు. భారత వ్యతిరేక సరిహద్దు ఉగ్రవాదాన్ని తక్షణమే నిలిపివేయాలని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మూసివేయాలని ఆమె పాకిస్తాన్‌ను కోరారు.

“పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ, కాశ్మీర్, లడఖ్ లలో తీవ్రమైన,  నిరంతర మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రాంతంలో ఆపడం మంచిది. ఆ  హోదాలో  భౌతిక మార్పులను ప్రభావితం చేయకుండా ఉండండి.  చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించుకొని తమ క్రింద ఉన్న భారత భూభాగాలను ఖాళీ చేయండి” అంటూ ఆమె పాకిస్థాన్ కు స్పష్టమైన సందేశం ఇచ్చారు.

ఐక్యరాజ్యసమితిలో మండిపడ్డ భారత్ 

మరోవంక, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చ సందర్భంగా కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్ దేశ దౌత్యవేత్త మునీర్‌ అక్రమ్‌ ప్రస్తావించగా భారత్‌ విరుచుకుపడింది. కశ్మీర్‌లోని పరిస్థితులను రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంతో పోల్చగా  ఐక్యరాజ్య సమిథిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో రష్యా యద్ధం వంటి తీవ్రమైన అంశాలపై చర్చలు జరుగుతున్నాయని, అయితే, ఈ ఫోరమ్‌ను ఓ ప్రతినిధి బృందం దుర్వినియోగం చేయడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆమె పేర్కొన్నారు.

 “నా దేశంపై పలికిమాలిన, అర్థం వ్యాఖ్యలు” చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇంకా ఆమె మాట్లాడుతూ పదేపదే అబద్ధాలు చెప్పే “మనస్తత్వం ఉన్న దేశాలు ఎప్పుడూ సానుభూతిని పొందేందుకు ప్రయత్నిస్తాయని, కానీ, దానివల్ల ప్రయోజనం లేదని రుచిరా కాంబోజ్‌ హితవు చెప్పారు.

పాక్‌ ప్రతినిధి విశ్వసించినా, లేకపోయినా జమ్మూకశ్మీర్‌ మొత్తం ఎల్లప్పడూ భారత్‌లో అంతర్భాగమేనని, విడదీయరాని బంధం ఉంటుందని ఆమె తేల్చి చెప్పారు.  పౌరులు తమ జీవించే హక్కును, స్వేచ్ఛను ఆస్వాదించగలిగేలా ఉగ్రవాదాన్ని ఆపాలని తాము పాక్‌ను కోరుతున్నామని ఆమె చెప్పారు.