మునుగోడు ఓటర్ నమోదు పక్రియ నిలిపివేత 

ఉపఎన్నిక జరుగుతున్న మునుగోడులో పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు పక్రియను నిలిపి వేయమని ఎన్నికల కమీషన్ ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మునుగోడు నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రకటనకు సంబంధించిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. 
 
ఎన్నికల కమిషన్ నివేదిక పరిశీలించిన అనంతరం విచారణ జరుపుతామని చెప్పింది. ఈ మేరకు కేసును ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. అంతకు ముందు ఎలక్షన్ కమిషన్ మునుగోడు ఓటర్లకు సంబంధించి నివేదికను హైకోర్టుకు సమర్పించింది. 
ఇప్పటి వరకు 25 వేల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 12వేల అప్లికేషన్లు మాత్రమే అప్రూవ్ చేసినట్లు చెప్పింది. మరో 7వేల ఓట్లు తిరస్కరించామని, మిగిలినవి పెండింగ్ లో ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చింది. 
 
ఈ నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రకియను నిలిపివేయాలని పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పెండింగ్ లో ఉన్న ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. 
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఓటర్ లిస్టులో అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. రెండు నెలల్లో కొత్తగా 25 వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయంపై విచారణ జరపాలని కోరుతూ మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది.
అంతకుముందు 7 నెలల్లో కేవలం 1,474 మంది మాత్రమే ఓటు కోసం అప్లై చేసుకోగా, ఈ మధ్యకాలంలో 24,781 దరఖాస్తు  చేసుకోవడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో జులై 31 నాటికి ఉన్న ఓటర్ లిస్టు ఆధారంగానే మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కు ఆదేశించాలని కోరింది.
ఈ నెల 14న ఎలక్షన్ కమిషన్ కొత్త ఓటర్ లిస్ట్ ప్రకటించనున్నందున కోర్టు నిర్ణయం వెలువడే వరకు జాబితా విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. కాగా,  మునుగోడు  కొత్త ఓటర్ల నమోదుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర బీజేపీ నేతలు స్వాగతించారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి రచనా రెడ్డి మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్  పార్టీ కుట్రను అడ్డుకున్నామని తెలిపారు. 
 
ఉప ఎన్నికలో 25 వేల ఓట్లను ఒకేసారి డంపు చేయాలని టీఆర్ఎస్ కుట్ర చేసిందని ఆమె ఆరోపించారు. నియోజకవర్గంతో సంబంధం లేని వారిని ఓటర్లుగా నమోదు చేయించారని, అధికార యంత్రాంగంపై ఒత్తిడి చేస్తోందని ఆమె విమర్శించారు. బీజేపీ అడ్డుకోకుంటే 25 వేల బోగస్ ఓట్లు నమోదు అయ్యేవని రచనా రెడ్డి పేర్కొన్నారు.
 ఎన్నికల అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ బోగస్‌ ఓటర్ల నమోదుకు ఒత్తిడి తీసుకొస్తోందని బీజేపీ బృందం  గురువారం ఎన్నికల కమీషన్ కు ఢిల్లీలో  ఫిర్యాదు చేసింది. కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారందరినీ మునుగోడు వాసులుగానే పరిగణించేలా ఒత్తిడి చేసి వారి ద్వారా పోలింగ్‌ బూత్‌లను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. 
 
 అధికారులు కూడా దరఖాస్తులను పరిశీలించకుండానే  ఆమోదిస్తున్నారని, ఒక్క దరఖాస్తును కూడా తిరస్కరించడంలేదని బృందం విమర్శించింది.  జూలై 31వ తేదీ వరకు ఉన్న ఓటర్‌ లిస్టును ఫ్రీజ్‌ చేయాలని, ఆ తరువాత వచ్చిన దరఖాస్తులను  పరిగణనలోకి తీసుకోవద్దని, ఆమోదించిన ఓట్లను ఓట్ల జాబితాలో చేర్చవద్దని అభ్యర్థించారు.