కర్ణాటకలో మత మార్పిడి నిరోధక చట్టం కింద తొలి కేసు

కర్ణాటక రాష్ట్ర పోలీసులు ఈ ఏడాది సెప్టెంబర్ 30న నోటిఫై చేసిన కర్ణాటక మతస్వేచ్ఛ రక్షణ చట్టం కింద తొలి కేసు నమోదు చేశారు. యశ్వంత్‌పూర్ పోలీసులు అక్టోబర్ 13న చట్టంలోని సెక్షన్ 5 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఉత్తర బెంగళూరులోని బికె నగర్‌కు చెందిన సయ్యద్ ముయిన్‌ను అరెస్టు చేశారు. 

చికెన్ స్టాల్ నడుపుతున్న ముయిన్ 18 ఏళ్ల ఖుష్బూను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇస్లాం మతంలోకి మార్చాడని  పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఖుష్బూ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందినది. గత 10 సంవత్సరాలుగా బెంగళూరులో నివసిస్తున్నారు.

ఆమె తండ్రి సురేంద్ర యాదవ్ వృత్తిరీత్యా పెయింటర్. తల్లి గ్యాంతీదేవి గృహిణి. ఈ దంపతులకు మరో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.ఖుష్బూ కనిపించకుండా పోయిన కొన్ని గంటల తర్వాత గ్యాంతిదేవి అక్టోబర్ 5న పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా ఖు ష్బూను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న ముయీన్‌తో కలిసి తన కూతురు పారిపోయిందని గ్యాంతీదేవి అనుమానం వ్యక్తం చేసింది.

పాత  ఫిర్యాదులో ఆమె మతాంతీకరణకు సంబంధించిందేమి ఫిర్యాదుచేయలేదు.  కానీ తర్వాత అక్టోబర్ 13న తన కూతురును మతం మార్చారని ఫిర్యాదు చేసింది. కొత్త చట్టంలోని 5వ సెక్షన్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పెళ్లి పేరుతో మతాంతీకరణ జరిగిందని తెలిపారు.

ఎవరైనా మతాంతీకరణ చెందాలనుకుంటే నెల ముందుగానే జిల్లా మెజిస్ర్టేట్ లేక అదనపు జిల్లా మెజిస్ర్టేట్ కు రాతపూర్వకంగా ఫారమ్ 1 ద్వారా తెలుపాల్సి ఉంటుంది. మతాంతీకరణ చేపట్టే వ్యక్తి కూడా నెల ముందుగానే ఫారమ్ 2ను సమర్పించాల్సి ఉంటుంది. 

కొత్త చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం బలవంతంగా మతమార్పిడికి పాల్పడితే మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తారు. ప్రస్తుతం ముయీన్‌కు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.